రివ్యూ: సాక్ష్యం

రన్ టైమ్: 2 గంటల 46 నిమిషాలు

నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్,పూజా హెగ్డే, జగపతిబాబు,శరత్ కుమార్,మీనా, రావు రమేష్,రవి కిషన్,అశుతోష్ రాణా,జయప్రకాష్, వెన్నెల కిషోర్,బ్రహ్మాజీ,అనంత శ్రీరామ్ తదితరులు

సినిమాటోగ్రపీ: ఆర్థర్ ఎ.విల్సన్

మ్యూజిక్: హర్షవర్థన్ రామేశ్వర్

మాటలు: సాయి మాధవ్ బుర్రా

నిర్మాత: అభిషేక్ నామా

కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం: శ్రీవాస్

రిలీజ్ డేట్: జులై 27,2018

కథేంటి..?

తన అక్రమాలకు అడ్డు వస్తున్నాడని రాజా (శరత్ కుమార్) ను అతని మొత్తం ఫ్యామిలీని అతి కిరాతకంగా చంపేస్తాడు మునుస్వామి (జగపతిబాబు) అతని ముగ్గురు తమ్ముల్లు.. శత్రు శేషం మిగలకుండా చంపేసామనుకుంటారు కానీ పంచ భూతాల దయతో రాజా కొడుకు దూరంగా వెళ్లి పెరిగి పెద్దవుతాడు.అదే పంచభూతాల సాక్ష్యం వల్ల విశ్వ (బెల్లంకొండ శ్రీనివాస్) మును స్వామి మీద ఎలా రివేంజ్ తీర్చకున్నాడనేది కథ..

నటీనటుల పర్ఫార్మెన్స్:

హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఫర్వాలేదనిపించాడు.మునుపటి సినిమాలతో పోలిస్తే నటనలో ఇంప్రూవ్ అయ్యాడు.డాన్సులు,ఫైట్లతో అలరించాడు.హీరోయిన్ పూజా హెగ్డే కు చెప్పుకోదగ్గ పాత్ర దొరకలేదు.గ్లామర్ వరకు ఓకే.జగపతిబాబు మరోసారి క్రూరమైన విలన్ గా కనిపించి మెప్పించాడు.రవి కిషన్, అశుతోష్ రాణా లు తమకు అలవాటైన విలన్ పాత్రల్లో రాణించారు.గేయ రచయిత అనంత శ్రీరామ్ ఓ పాత్రలో మెరిసారు. శరత్ కుమార్,మీనా,రావు రమేష్,బ్రహ్మాజీ,వెన్నెల కిషోర్ రెగ్యులర్ రోల్స్ చేశారు. కృష్ణ భగవాన్,రఘుబాబు లాంటి వాళ్లు చాలా మందే ఉన్నా ఎవరికీ పెద్దగా గుర్తింపు లేని క్యారెక్టర్లే ఉన్నాయి.

టెక్నికల్ వర్క్:

టెక్నికల్ టీమ్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్థన్ రామేశ్వర్ గురించి.పాటల్లో వైవిధ్యం చూపించ లేకపోయినా.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మాత్రం మంచి ఔట్ పుట్ ఇచ్చాడు.తన ఆర్.ఆర్ తో మాములు యాక్షన్ సీన్లను బాగా ఎలివేట్ చేశాడు. అంతే కాకుండా ‘‘శివమ్,శివమ్ ’’ అనే థీమ్ సాంగ్ కూడా ఆకట్టుకుంటుంది.. ఆర్థర్.ఎ విల్సన్ సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది..ఎడిటింగ్ ఇంకా క్రిస్ప్ గా ఉండాల్సింది.యాక్షన్ ఎపిసోడ్ లు బాగున్నాయి.గ్రాపిక్ వర్క్స్ గొప్ప స్టాండర్డ్స్ లేకపోయినా..ఉన్నంత బానే చేశారు.సాయి మాధవ్ బుర్రా రాసిన మాటలు ఆకట్టుకుంటాయి.

విశ్లేషణ:

‘‘సాక్ష్యం’’ రెగ్యులర్ రివేంజ్ స్టోరీ యే.. కానీ పంచభూతాల కాన్సెప్ట్ ఇన్వాల్వ్ చేయడం వల్ల ఇంట్రస్టింగ్ గా అనిపిస్తుంది..అయితే కథలో ఉన్నంత ఇంట్రస్ట్.. తీతలో కాస్త లోపించిందనే చెప్పాలి..దర్శకుడు శ్రీవాస్ అనుకున్న పాయింట్ బాగుంది.దాన్నీ మేజర్ పార్ట్ వరకు బాగానే డీల్ చేసిన..స్క్రీన్ ప్లే లోపాలుండటం వల్ల ‘‘సాక్ష్యం’’ అనుకున్నంత ఎఫెక్ట్ కలిగించదు.ఫస్టాఫ్ అంతా రొటీన్ లవ్ ట్రాక్ తో బోర్ గా సాగుతుంది.ఎన్నో సినిమాల్లో చూసేసిన లవ్ సీన్లతో విసిగించారు.అయితే ఇంటర్వెల్ పాయింట్ దగ్గర మెయిన్ కథలోకి తీసుకెళ్లిన డైరెక్టర్ ఆ తర్వాత మాత్రం గ్రిప్పింగ్ గా నడిపించాడు.అనంత శ్రీరామ్ గేమ్ డిజైన్ చేసినట్టుగానే హీరో తనకు తెలియకుండానే విలన్స్ ను చంపడం ఇంట్రస్టింగ్ గా సాగుతుంది..కాశి యాక్షన్ ఎపిసోడ్,క్వారీ ఫైట్ బాగా కంపోజ్ చేశారు. మధ్యలో పాటలు కథకు అడ్డుపడ్డాయి. క్లైమాక్స్ వరకు ఉత్కంఠ క్రియేట్ చేసిన డైరెక్టర్ అక్కడ ఓ లాజిక్ లేని సీన్ తో ముగించేశాడు.. ఓవరాల్ గా ‘‘సాక్ష్యం’’ కాన్సెప్ట్ ఓరియంటెడ్ కమర్షియల్ సినిమా.యాక్షన్ ఎపిసోడ్ లు,బ్యాక్ గ్రౌండ్ స్కోర్,భారీ నిర్మాణ విలువల వల్ల పెట్టిన డబ్బుకు న్యాయం కలుగుతుంది..స్క్రీన్ ప్లే,డైరెక్షన్ ఇంకా పకడ్బందీగా ఉండి ఉంటే సినిమా రేంజ్ వేరేలా ఉండేది.కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు నచ్చకపోయినా..మాస్ ఆడియన్స్ మాత్రం ఆదరించే అవకాశముంది.

Latest Updates