రూల్ ఈజ్ రూల్ : 2 రన్స్ తో మ్యాచ్ ముగిసే టైమ్‌లో లంచ్ బ్రేక్

KOHLIసౌతాఫ్రికా-ఇండియా మధ్య ఆదివారం (ఫిబ్రవరి-4) సెంచూరియన్ లో జరిగిన రెండో వన్డేలో ఆసక్తికరమైన సన్నివేశం జరిగింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) రూల్ అంటే రూల్.. అది పసికూన జట్టుకైనా.. అగ్రశ్రేణి జట్టుకైనా ఒకటే. మ్యాచ్ ఎలాంటి స్థితిలో ఉన్నా.. అంపైర్లు కఠినంగా నిబంధనలు పాటిస్తారు. దీనికి ఉదాహరణ.. ఇండియా, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో వన్డే కొద్ది నిమిషాల్లోనే ముగుస్తుందన్న దశలో అంపైర్లు లంచ్ బ్రేక్ ఇవ్వడం. 119 పరుగుల లక్ష్య ఛేదనకి దిగిన భారత్ జట్టు శిఖర్ ధావన్ (51: 50 బంతుల్లో 9×4), విరాట్ కోహ్లి (44: 47 బంతుల్లో 4×4, 1×6) దూకుడుగా ఆడటంతో 19 ఓవర్లు ముగిసే సమయానికి 117/1తో నిలిచిన దశలో అంపైర్లు మ్యాచ్‌ని నిలిపివేశారు.

స్టేడియంలోని సిబ్బందితో పాటు.. టీవీల్లో మ్యాచ్‌ని చూస్తున్న అభిమానులకి కూడా అసలేం జరిగిందో..కొద్దిసేపటి వరకు అర్థం కాలేదు. కెప్టెన్ విరాట్ కోహ్లి క్రీజులో నుంచి వెలుపలికి వస్తూ.. ఫీల్డ్ అంపైర్లతో ఏదో అసహనంగా మాట్లాడుతున్నట్లు కనిపించడంతో.. ఆ ఆసక్తి రెట్టింపైంది. ఆ తర్వాత లంచ్‌ బ్రేక్ అని తెలియగానే.. ఏంటి కామెడీ చేస్తున్నారా.. అంటూ అభిమానులు ఒకింత అసహనం వ్యక్తం చేశారు. మరో 2 పరుగులు చేస్తే మ్యాచ్ ముగుస్తుందన్న దశలో బ్రేక్ ఇవ్వడమేంటి.. అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. ICC రూల్ అంటే.. రూలే మరి అంటున్నారు కొంతమంది నెటిజన్లు.

Posted in Uncategorized

Latest Updates