ఇస్రో గగన్ యాన్ కు కేంద్రం ఆమోదం.. రూ.10వేల కోట్లు మంజూరు

ఢిల్లీ : దేశ తొలి మానవసహిత అంతరిక్ష యాత్రకు బూస్ట్ ఇచ్చే నిర్ణయం తీసుకుంది కేంద్ర కేబినెట్. గగన్ యాన్ ప్రాజెక్ట్ ను ఆమోదిస్తూ….. రూ.10వేల కోట్ల బడ్జెట్ ను కేటాయించింది. 2022లో శ్రీహరికోట స్పేస్‌ సెంటర్ నుంచి గగన్‌ యాన్‌ ప్రయోగం జరుగనుంది. జీఎస్ఎల్వీ మార్క్ 3 ద్వారా ఈ ప్రయోగాన్ని నిర్వహించబోతున్నారు. ముగ్గురు వ్యోమగాములను 7 రోజుల పాటు స్పేస్ లో ఉంచేలా గగన్ యాన్ ప్రాజెక్ట్ డిజైన్ చేశారు.

గగన్ యాన్ ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులిచ్చామని… బడ్జెట్ కు శుక్రవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. 2022లో గగన్ యాన్ ప్రయోగానికి రూ.10వేల కోట్లు ఖర్చవుతుందని ఇస్రో అంచనా వేస్తూ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చిందని ఆయన తెలిపారు. ఈ బడ్జెట్ కు ఆమోదిస్తూ కేంద్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుందని రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు.

గగన్ యాన్ ద్వారా ముగ్గురు భారతీయ వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపనున్నట్లు ఇస్రో అధికారులు తెలిపారు. వీరు ఏడు రోజుల పాటు అంతరిక్షంలో ఉంటారు. ఈ ప్రయోగం సఫలమైతే అంతరిక్షంలోకి మానవులను పంపిన నాలుగో దేశంగా భారత్ నిలుస్తుంది. ఇప్పటివరకు రష్యా, అమెరికా, చైనాలు మాత్రమే అంతరిక్షంలోకి మనుషులను పంపించాయి. గగన్ యాన్ భారతదేశపు మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష కార్యక్రమంగా చరిత్రలో నిలవనుంది.

 

 

Posted in Uncategorized

Latest Updates