రూ.15వేల కోట్ల అప్పు ఎవడు కట్టాలి : దివాళా పిటీషన్ వేయనున్న ఎయిర్ సెల్

aircel1అప్పుల భారంతో మూతబడుతున్న టెలికం సంస్థల జాబితాలో చేరింది ఎయిర్‌సెల్‌. రూ. 15వేల 500 కోట్ల అప్పులు పేరుకుపోవడంతో నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)లో దివాలా పిటిషన్‌ వేయనుంది కంపెనీ. మలేసియాకి చెందిన మ్యాక్సిస్‌ కంపెనీ.. ఇండియాలో ఎయిర్‌సెల్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. మారిన పరిస్థితుల్లో ఆ సంస్థ వెనక్కి వెళ్లింది. దీంతో రూ.15వేల 500 కోట్ల అప్పులు.. పునర్‌వ్యవస్థీకరణ కోసం 2017 సెప్టెంబర్‌ నుంచి బ్యాంకులతో ఎయిర్‌సెల్‌ చర్చలు జరుపుతున్నది. అయినా ఫలితం లేదు.

వ్యాపారాన్ని నిర్వహించేందుకు కంపెనీ దగ్గర కనీస డబ్బు కూడా లేదని.. ఉద్యోగుల జీతాలు చెల్లించడం కూడా కష్టంగా ఉందని ఎయిల్ సెల్ కంపెనీ ప్రకటించింది. 2016 సెప్టెంబర్‌లో చౌక చార్జీలతో రిలయన్స్‌ జియో ఎంట్రీ ఇచ్చాక.. మూతబడుతున్న కంపెనీల్లో ఎయిర్‌సెల్‌ నాలుగోది.

ఎయిర్‌సెల్‌ ఆదాయం ప్రతి నెలా రూ.400 కోట్లు ఉంటుంది. ఇందులో రూ.100 కోట్లు ఇతర ఆపరేటర్లకు కాల్‌ టర్మినేషన్‌ చార్జీల కింద చెల్లిస్తున్నారు. మరో రూ.280 కోట్లు వెండార్స్‌కి చెల్లిస్తోంది. మిగతాది లైసెన్సు ఫీజులు, పన్నులు, వడ్డీలు. మూడు నెలలుగా రూ.60 కోట్ల బాకీ పడటంతో ఐడియా సెల్యులార్‌ ఇటీవలే ఎయిర్‌సెల్‌కి ఇంటర్‌కనెక్ట్‌ సర్వీసులను నిలిపివేసింది. మెరుగైన సర్కిల్స్‌పైనే దృష్టి పెట్టేందుకు ఎయిర్‌సెల్‌ సైతం.. ఆరు సర్కిల్స్‌లో సేవలు నిలిపివేసింది.

ఇప్పటికే కొన్ని కంపెనీలు అప్పులు రాబట్టుకోవడం కోసం ఎయిర్‌సెల్‌పై కేసులు వేశాయి. ఎరిక్సన్, నోకియా, జెడ్‌టీఈ వంటి నెట్‌వర్క్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలు సెప్టెంబర్‌ నుంచి బకాయిల రికవరీపై చర్చలు జరుపుతున్నాయి. సెప్టెంబర్‌ నుంచి అవుట్‌సోర్సింగ్‌ టెక్నాలజీ, కాల్‌ సెంటర్‌ సర్వీస్‌ సంస్థలకు కూడా ఎయిర్‌సెల్‌ చెల్లింపులు జరపడం లేదు. ఇక మిగిలింది దివాళా పిటీషన్ వేయటమే. మరి బ్యాంకులకు చెల్లించాల్సిన రూ.15వేల 500 కోట్లు ఎవడు కట్టాలి అనేది ఇప్పుడు ప్రశ్న..

Posted in Uncategorized

Latest Updates