రెండేళ్లలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి: కేసీఆర్

హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేసి కోటి ఎకరాలకు సాగునీరందించాలని సీఎం  కేసీఆర్  అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల నిర్మాణం కోసం సేకరించిన భూములకు వెంటనే పరిహారం చెల్లించాలని ఆయన అన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రగతి భవన్ లో నిన్న(శనివారం) అధికారులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. భూసేకరణకు అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులకు సూచించారు.

ప్రాజెక్ట్  నిర్మాణ ప్రాంతాలను స్వయంగా 2 రోజుల పాటు సందర్శించాలని నిర్ణయించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం బ్యారేజిలను, పంపు హౌజులను సీఎం డిసెంబర్ 18న సందర్శిస్తారు. ఆ తర్వాత  రోజు ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవ పథకం కింద చేపట్టిన పనులను పరిశీలిస్తారు.గంధమల్ల, బస్వాపురం రిజర్వాయర్ల భూ నిర్వాసితులకు చెల్లించడానికి 80 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖను సీఎం కోరారు. భూపాలపల్లి,  నిర్మల్,  పెద్దపల్లి,  భువనగిరి జిల్లాల కలెక్టర్లకు కూడా వెంటనే పరిహారానికి సంబంధించిన డబ్బులు విడుదల చేయాలని చెప్పారు. కాళేశ్వరం పనుల్లో వేగం పెంచి వచ్చే జూలై నాటికి నీరందించాలన్నారు సీఎం.

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజిలు, పంపుహౌజుల నిర్మాణాల్లో వేగం పెరగాలని సూచించారు. కాళేశ్వరం పనుల్లో జాప్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని హెచ్చరించారు. ఇక సీతారామ ఎత్తిపోతల పథకంతో పాటు, శ్రీరామసాగర్ పునరుజ్జీవ పథకం, దేవాదుల ప్రాజెక్టు పనులు అనుకున్నంత వేగంగా జరగడం లేదని కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సీతారామ ఎత్తిపోతలకు 11 వేల కోట్ల నిధుల సేకరణ పూర్తయిందని, పనుల్లో ఏమాత్రం జాప్యం, నిర్లక్ష్యం వహించొద్దన్నారు. ఈ సందర్భంగా వర్క్ ఏజన్సీల బాధ్యులతో సీఎం స్వయంగా ఫోన్లో మాట్లాడారు. ఎస్.ఆర్.ఎస్.పి. పునరుజ్జీవ పథకం పనులను మే కల్లా పూర్తి చేస్తామని వర్క్ ఏజన్సీలు సీఎంకు మాటిచ్చాయి. పాలమూరు-రంగారెడ్డి, డిండి, సీతారామ, దేవాదుల ప్రాజెక్టులపై త్వరలోనే మరోసారి విస్తృత స్థాయిలో సమీక్ష నిర్వహించాలని సీఎం నిర్ణయించారు.

 

Posted in Uncategorized

Latest Updates