రెండో రోజు : అటుకుల బతుకమ్మ

తెలంగాణ సంప్రదాయ పండగ బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తొమ్మిది రోజుల బతుకమ్మ పండగలో ఇవాళ రెండో రోజు అటుకుల బతుకమ్మ చేస్తారు. పూల అలంకరణ మామూలుగానే ఉన్నా… నైవేద్యాల తయారీ కాస్త భిన్నంగా ఉంటుంది. చప్పటి పప్పు, బెల్లం అటుకులు నివేదిస్తారు. చప్పటి పప్పును వివిధ ప్రాంతాల్లో రకరకాలుగా తయారుచేస్తారు.

ఇందుకు పెసర లేదా కందిపప్పును నానబెట్టి దాంతో ప్రసాదం తయారుచేస్తారు. ఈ వంటకం చేయనివారు పప్పు బెల్లం కలిపి తీసుకువెళ్తారు. వీటికి అటుకులు కూడా కలిపి… బతుకమ్మ ఆడిన తర్వాత మహిళలు పంచుకుంటారు.

కొన్ని ప్రాంతాల్లో అటుకుల ముద్దలు తయారుచేస్తారు. బెల్లాన్ని ముదురుపాకం పట్టి అప్పటికే నెయ్యిలో వేయించి పెట్టుకున్న అటుకులను కలిపి ముద్దగా చేస్తారు. కొందరు అటుకులను నానబెట్టి రుబ్బి వాటితో రొట్టెలు చేస్తారు. ఇలా అటుకులనే ప్రధానంగా సద్ది కట్టుకుని తీసుకెళతారు. అందుకే దీన్ని అటుకుల బతుకమ్మ అంటారు.

పెసరపప్పులో ఎక్కువగా మాంసకృతులుంటాయి. బెల్లం నుంచి ఇనుము అందుతుంది. ఈ రెండు ఆడవారికి అత్యంత మేలుచేస్తాయి. 9 రోజుల పాటు జరగనున్న ఈ బతుకమ్మ వేడుకలకు ఇలా ఒక్కోరోజు ఓ ప్రత్యేకత ఉంది.

Posted in Uncategorized

Latest Updates