రేపటి నుంచి పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

హైదరాబాద్ : రేపటి(బుధవారం – అక్టోబర్ 10) నుంచి పత్తి కొనుగోలు కేంద్రాలు తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభించాలని మార్కెటింగ్ శాఖ సంచాలకులు లక్ష్మీబాయి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 267 జిన్నింగ్ మిల్స్ లో పత్తి కొనుగోలు కేంద్రాలను, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో 11 పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

పత్తి రైతుల నుంచి ఇప్పటికే పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయని చెప్పారు. జిన్నెర్స్ పదవ తేదీ లోపల , సీసీఐతో అగ్రిమెంట్స్ చేసుకోవాలని సూచించారు రైతులు తొందరపడి పత్తి అమ్మకాలు చేయవద్దని, పత్తిలో తేమ శాతం ఎక్కువగా ఉంటే ధర తక్కువ పలుకుతుందని, పత్తిలో తేమ 12 శాతం ఉంటే ఎక్కువ ధర రైతులకు అందుతుందని మార్కెటింగ్ శాఖ సంచాలకులు లక్ష్మీబాయి తెలిపారు. పత్తి ఆరిన తర్వాతే కొనుగోలు కేంద్రాలకు తేవాలని రైతులకు సూచించారు. ఈ విషయాన్ని రైతులకు తెలియజెప్పేలా మార్కెటింగ్ DD , జేడీలు ప్రచారం చేయాలని ఆదేశించారు. పత్తి కొనుగోలును పర్యవేక్షించడానికి, రైతులకు ఇబ్బందులు లేకుండా క్షేత్ర స్థాయిలో నిత్యం సమీక్షించడానికి 9 మంది అధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు.

నిజామాబాద్ లో 40, సిద్దిపేటలో 8, నిర్మల్ జిల్లాలో 21 మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. క్వింటా 1700 రూపాయల మద్ధతు ధరతో లక్షా 48 వేల క్వింటాళ్ల మొక్క జొన్నలను కొనుగోలు చేసినట్లు తెలిపారు. పెసలు కొనుగోలుకు ఆరు కేంద్రాలు ఏర్పాటు చేసి 6975 మద్దతు ధరతో 9,411 క్వింటాళ్ల పెసలు ఇప్పటి వరకు కొనుగోలు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో మినుములు, సోయ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. రాష్ట్రంలోని గోదాములన్నంటినీ వినియోగం తేవాలని, ఎక్కడా తాళాలు వేసి ఉండే పరిస్థితి ఉండరాదని మార్కెటింగ్ శాఖ అధికారులకు లక్ష్మీబాయి సూచించారు. ఈ సమీక్షలో మార్కెఫెడ్ ఎండీ సురేందర్ రెడ్డి, వేర్ హౌస్ ఎండీ భాస్కరా చారి, మార్కెటింగ్ ఓఎస్డీ జనార్థన్ రావు, మార్కెటింగ్ శాక డీడీలు, జేడీలు పాల్గొన్నారు.

Posted in Uncategorized

Latest Updates