రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

బుధవారం(జూలై-18) నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆగస్ట్ 10 వరకు సభలు నవడనున్నాయి. ఒక్క బిల్లుపై చర్చ జరగకుండా… మొత్తం రభసతో బడ్జెట్ కొట్టుకుపోగా…ఈ సారి అలా జరగకుండా ప్రభుత్వం జాగ్రత్త పడుతోంది. కీలక సమస్యలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఢిల్లీలోని కాంగ్రెస్ నేతృత్వంలో సమావేశమైన విపక్ష పార్టీల నేతలు…పార్లమెంట్ లో అనుసరించాల్సిన తీరుపై చర్చించారు. సమావేశాల్లో దూకుడుగా సర్కార్ ను అడ్డుకోవాలని నిర్ణయించారు.

ట్విట్టర్ లో మోడీకి సవాల్ విసిరారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. మహిళా సాధికారత పోరాట యోధుడిగా చెప్పుకుంటున్న మోడీ… పార్లమెంట్ మహిళా రిజర్వేషన్ బిల్ పాస్ చేయించాలని రాహుల్ డిమాండ్ చేశారు. బిల్లుకు కాంగ్రెస్ బేషరతుగా మద్దతు ఇస్తుందన్నారు.

అటు పార్లమెంట్ వ్యవహారాల సహాయ మంత్రి విజయ్ గోయల్… మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహా ఎస్పీ, బీఎస్పీ, శివసేన, టీఆర్ఎస్, బీజేడీ, సీపీఐ పార్టీల నేతలను కలిసి…సభను సాఫీగా సాగేలా చూడాలని కోరారు. మరోవైపు ఇవాళ అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సమావేశం కానున్నారు. ఇవాళ సాయంత్రం పార్లమెంట్ లైబ్రరీ బిల్డింగ్ లో ఈ మీటింగ్ జరగనుంది. మరోవైపు ప్రతిపక్ష పార్టీలతో ప్రభుత్వం కూడా మరో సమావేశం నిర్వహించనుంది. ఇక బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటైన ప్రతిపక్షాలు కూడా… సమావేశమై… సంయుక్త కార్యాచరణపై చర్చించుకున్నాయి. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికపై ప్రధాన చర్చ జరగనుంది. ఈ నెల 1న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా P.J. కురియన్ పదవీకాలం ముగియడంతో… ఆయన సక్సెసర్ ఎన్నికపై ఆసక్తి ఏర్పడింది.

రాజ్యసభలో సభా నాయకుడిగా ఉన్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్యం బాగాలేకపోవడంతో మొత్తం సెషన్ కు హాజరుకావడంలేదు. దీంతో ఆర్థికమంత్రిత్వ బాధ్యతలు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ చూస్తున్నారు. అయితే తాత్కాలికంగానైనా పెద్దలసభలో లీడర్ ఆఫ్ ది హౌస్ ను నియమించాల్సిన పరిస్థితి బీజేపీకి ఏర్పడింది. జైట్లీ స్థానాన్ని భర్తీ చేసేందుకు రవిశంకర్ ప్రసాద్, జేపీ నడ్డా, విజయ్ గోయెల్ ల పేర్లను బీజేపీ చీఫ్ అమిత్ షా పరిశీలిస్తున్నారు.

 

Posted in Uncategorized

Latest Updates