రేపట్నుంచి కొమురవెల్లి మల్లన్న జాతర

సిద్దిపేట : తెలంగాణ ప్రజలు కొంగు బంగారంగా కొలిచే.. కొమురవెల్లి మల్లన్న జాతర ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. జాతర సందర్భంగా అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉదయం 10.45 గంటలకు మల్లికార్జునస్వామి కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో వివాహ క్రతువు నిర్వహిస్తారు. పెండ్లి పత్రికలు, బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలు ఇప్పటికే అతిథులకు పంచిపెట్టారు. స్వామివారి కల్యాణం నిర్వహించే అర్చకులు రెండు వంశాలకు చెందినవారు ఉన్నారు. వీరిలో అమ్మవారి తరఫున మహాదేవుని వంశంవారు కన్యాదానం చేస్తారు. పగిడన్న వంశం వారు స్వామివారి తరఫున స్వీకరించి కల్యాణం జరిపిస్తారు. రేపట్నుంచి జాతర మొదలుకాగా.. ఉగాదికి బ్రహ్మోత్సవాలతో ముగిస్తుంది. ఈ కల్యాణ మహోత్సవానికి రాష్ట్రం నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తారు.

 

ఆదివారం మల్లన్న కల్యాణం.. ఉగాది వరకు బ్రహ్మోత్సవాలు 

సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే ఆదివారంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమై.. ఉగాది పండుగ ముందు వచ్చే ఆదివారం ముగుస్తాయి. మూడు నెలలపాటు బ్రహ్మోత్సవాలు (జాతర) అంబరాన్నంటుతాయి. బ్రహ్మోత్సవాల్లో మొదటి ఆదివారాన్ని పట్నంవారంగా, రెండవ ఆదివారాన్ని లష్కర్‌ వారంగా పిలుస్తారు. ఈ రెండు వారాలనాడు హైదరాబాద్ జంట నగరాలనుంచి భక్తులు పెద్దఎత్తున తరలివస్తారు. మూడు నెలల జాతరలో మహాశివరాత్రి పర్వదినం రోజున ఆలయ ఆధ్వర్యంలో పెద్దపట్నం నిర్వహిస్తారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా అగ్నిగుండాలు అత్యంత వైభవంగా చేపడుతారు.

 

Posted in Uncategorized

Latest Updates