రేపు విశాఖకు సీఎం కేసీఆర్

కాంగ్రెస్, బీజేపీయేతర కూటమి ఏర్పాటులో వేగం పెంచారు సీఎం కేసీఆర్. గతంలో పలు రాష్ట్రాల్లో పర్యటించిన కేసీఆర్.. ఇప్పుడు మరికొందరు నేతలను కలవబోతున్నారు. రేపు (ఆదివారం) ఉదయం కుటుంబ సభ్యులు, పార్టీ ముఖ్యనేతలతో కలిసి ఏపీలోని విశాఖకు వెళ్తారు కేసీఆర్. శారదాపీఠంలోని  రాజశ్యామల ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. స్వామి స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకొని.. అక్కడి నుంచి భువనేశ్వర్ వెళ్తారు కేసీఆర్. రేపు సాయంత్రం 6 గంటలకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో సమావేశమై ఫెడరల్ ఫ్రంట్ పై చర్చిస్తారు. ఆదివారం రాత్రికి ఒడిశా ప్రభుత్వ అధికార నివాసంలో కేసీఆర్ బసచేస్తారు.

సోమవారం(డిసెంబర్-24) ఉదయం రోడ్డు మార్గంలో కోణార్క్ చేరుకొని అక్కడి పూరి జగన్నాథ ఆలయాన్ని దర్శించుకుంటారు కేసీఆర్.  సోమవారం సాయంత్రం.. భువనేశ్వర్ నుంచి కోల్ కతా వెళ్తారు. బెంగాల్ సీఎం మమత బెనర్జీతో సమావేశమై కూటమిపై చర్చిస్తారు. తర్వాత కాళీమాత ఆలయంలో పూజల చేసి.. రాత్రికి ఢిల్లీ చేరుకుంటారు. ఈనెల 25 నుంచి మూడు, నాలుగు రోజులు ఢిల్లీలోనే ఉండనున్నారు కేసీఆర్. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు మాయావతి, అఖిలేష్ యాదవ్ ను.. టీఆర్ఎస్ చీఫ్ కలవనున్నారు. ఫెడరల్ ప్రంట్ లక్ష్యాలు, కేంద్రం తీరుతో రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాలను వారికి వివరించనున్నారు. రెండోసారి సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి ఢిల్లీ వెళ్తున్న కేసీఆర్.. ప్రధాని మోడీని మర్యాదపూర్వకంగా కలవనున్నారు.

ఈసారి బీజేపీ, కాంగ్రెస్ సింగిల్ గా అధికారంలోకి వచ్చే అవకాశం లేదని భావిస్తున్న కేసీఆర్.. ప్రాంతీయ పార్టీలతో కలిసి ఢిల్లీలో చక్రం తిప్పాలని ప్లాన్ చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా కేసీఆర్ కలవనున్నారు. కొందరు కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సమస్యలపై కేసీఆర్ చర్చిస్తారని చెబుతున్నారు టీఆర్ఎస్ నేతలు.

Posted in Uncategorized

Latest Updates