రేవంత్ రెడ్డి ఆస్తులు, లావాదేవీలపై ఐటీ, ఈడీ మెరుపు దాడులు

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నివాసం, కార్యాలయాలపై ఇన్ కమ్ టాక్స్ అధికారులతో పాటు ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. నిన్న గురువారం మొత్తం 15 చోట్ల ఈ దాడులు చేశారు. రేవంత్ సోదరుడు, బంధువుల ఇళ్లలోను తనిఖీలు చేశారు. ప్రతి ఐటీ బృందంలో ఓ ఈడీ అధికారి ఉన్నారు.

శ్రీసాయి మౌర్య ఎస్టేట్స్ అండ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి రేవంత్ రెడ్డి సుమారు రూ.300 కోట్ల ఆర్థిక లావాదేవీలు కొనసాగించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ డబ్బు ద్వారా రేవంత్ రెడ్డి సుమారు పది నుంచి 15 కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

రేవంత్ రెడ్డి, అతని కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా కొనసాగుతున్న కంపెనీలకే డబ్బులు బదిలీ అయినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ సమాచారంతోనే ఐటీ, ఈడీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి రెండు ఐటీ బృందాలు వచ్చాయి. ప్రతి బృందంలో ఓ ఈడీ అధికారి ఉన్నారు. రేవంత్ సోదరుడి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ లోనూ సోదాలు నిర్వహించారు.

రేవంత్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారుల దాడులపై వివిధ రకాల ప్రచారం నడుస్తోంది. గతంలో ఓ అడ్వకేట్ వేసిన పిటిషన్ తో ఈ దాడులు నిర్వహిస్తున్నారని అంటున్నారు. కోట్ల రూపాయల్లో మార్పిడి జరిగిందని అడ్వకేట్ పిటిషన్ లో వివరించారు.

రేవంత్ రెడ్డిపై ఆదాయపన్ను, ఈడీ అధికారుల దాడుల నేపథ్యంలో.. గతంలోని ఓటుకు నోటు అంశంపై కూడా చర్చ సాగుతోంది. 2015 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.కోటి డీల్‌ కుదిర్చారని రేవంత్‌పై అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. నాడు ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి కేవలం రూ.50లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన మొత్తం కూడా బదిలీ అయిన విషయాన్ని ఏసీబీ గుర్తించలేదు. కొద్దిరోజుల క్రితం ఈ కేసును ఏసీబీ … ఈడీకి అప్పగించింది. ఈడీ అధికారులు రేవంత్ ఇళ్లతో పాటు కార్యాలయాలపై సోదాలు చేపట్టారని అంటున్నారు. అలాగే, కొద్ది రోజుల క్రితం జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో అక్రమాలు జరిగాయంటూ జూబ్లీహిల్స్ పోలీసులు రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేశాయి.

Posted in Uncategorized

Latest Updates