రేషన్ డీలర్లు బాధ్యతలను విస్మరించారు : అకున్ సబర్వాల్

ిలొుేయ-దాలనాిత
రేషన్  సరుకులకు డీడీలు చెల్లించని డీలర్లపై చర్యలకు సర్కారు రెడీ అయింది. డీలర్లకు నోటీసులు జారీచేసింది. గడువులోగా సమాధానం చెప్పని డీలర్లను సస్పెండ్ చేయాలని నిర్ణయించింది. మహిళా సంఘాల ద్వారా జులై 5 నుంచి పదో తేదీవరకు సరకులు పంపిణీ చేయాలని డిసైడైంది. సమస్యలు, ఫిర్యాదుల కోసం 24 గంటలు పనిచేసేలా.. కంట్రోల్  రూంలో 1967తో టోల్  ఫ్రీ నంబర్ అందుబాటులో ఉంచింది. రేషన్  డీలర్లు బాధ్యతలను విస్మరించడం బాధాకరమన్నారు పౌరసరఫరాలశాఖ కమిషనర్  అకున్  సబర్వాల్ . ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై MCHRDలో జాయింట్  కలెక్టర్లు, DCSOలు, DRDA పీడీలతో సమీక్ష చేశారు.

జులై ఒకటి నుంచి సమ్మె చేస్తున్నట్లు ప్రకటించారు రేషన్  డీలర్లు. సమ్మె పేరుతో పేదల ఆహార భద్రతకు ఆటంకం కలిగించడాన్ని తీవ్రంగా పరిగణించింది సర్కార్. సరుకుల పంపిణీలో అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటోంది. మహిళా సంఘాలతో 5 నుంచి పదో తేదీ వరకు సరుకులు పంపిణీ చేయాలని.. అవసరమైతే గడువు పొడిగించాలని అధికారులకు సూచించారు కమిషనర్.

ఆహార భద్రత కోసం ప్రతినెలా కిలో రూపాయి చొప్పున.. 2కోట్ల 75 లక్షల మందికి బియ్యాన్ని సరఫరా చేస్తోంది సర్కారు. ఈ బియ్యాన్ని లబ్ధిదారులకు అందించాల్సిన బాధ్యత డీలర్లపై ఉంది. సమ్మెను విరమించాలని రేషన్  డీలర్లకు అనేకసార్లు విజ్ఞప్తి చేసినా.. వారి వైఖరిలో మార్పురాలేదన్నారు సబర్వాల్. పేదలకు ఇబ్బంది కలగకుండా మహిళా సంఘాలు, అందుబాటులోని ఎన్ ఆర్  డీలర్ల ద్వారా సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయించామని చెప్పారు. జిల్లా, మండల, గ్రామ రేషన్  షాపుల వారీగా మహిళా సంఘాలను గుర్తించటంలో.. పారదర్శక విధానాన్ని పాటించాలని అధికారులకు సూచించారు.

గ్రామీణ ప్రాంతాల్లో డీఆర్ డీఏ, పట్టణ ప్రాంతాల్లో మెప్మా అధికారులు షాపులు పర్యవేక్షించాలని సూచించారు కమిషనర్. రికార్డుల నిర్వాహణకు మహిళా సంఘాలకు శిక్షణ ఇవ్వాలన్నారు. డీలర్ షిప్  బాధ్యతలు తీసుకున్న మహిళా సంఘాలతో.. జులై 1న మీసేవ కేంద్రాల్లో డీడీలు కట్టించాలన్నారు. సరుకుల పంపిణీ కంటే ముందు.. ఆయా ప్రాంతాల్లో సరుకుల నిల్వ, లబ్ధిదారులకు పంపిణీ అందుబాటులో ఉండేలా గ్రామ పంచాయతీ, ఐకేపీ, కమ్యూనిటీ హాల్స్ , యూత్  బిల్టింగ్ లను గుర్తించాలని సూచించారు. వేయింగ్  మెషిన్లను సమకూర్చుకోవాలన్నారు. ఈ విషయంలో తూనికలు కొలతలశాఖ అధికారుల సహకారం తీసుకోవాలని చెప్పారు.

జిల్లా, మండల, గ్రామస్థాయిలో పౌరసరఫరాలు, రెవెన్యూ, గ్రామీణాభివృద్ధి శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు కమిషనర్ అకున్ సబర్వాల్. రేషన్  సరుకులు ఎక్కడి నుంచి పంపిణీ చేస్తున్నారనే విషయాన్ని.. లబ్ధిదారులకు ముందుగానే సమాచారం అందజేయాలన్నారు. రేషన్ పంపిణీలో ఎలాంటి సమస్యలు రాకుండా.. జిల్లా స్థాయిలో జాయింట్  కలెక్టర్ , సబ్  డివిజన్  స్థాయిలో ఆర్డీఓ, మండల స్థాయిలో తహసీల్దార్ , గ్రామ స్థాయిలో వీఆర్ ఓలకు పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు.

 

Posted in Uncategorized

Latest Updates