రైతుల అగచాట్లు : సంగారెడ్డి జిల్లాలో నకిలీ విత్తనాల దందా

సంగారెడ్డి జిల్లాలో నకిలీ విత్తనాల దందా జోరుగా సాగుతోంది. ప్రైవేటు కంపెనీలు మాయమాటలు చెప్పి మార్కెట్లో విత్తనాలను అమ్ముతున్నాయి. ఏ విత్తనాలు వేస్తే మంచి దిగుబడి వస్తుందో తెలియక అయోమయానికి గురవుతున్నారు రైతులు. అన్నదాతల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని.. వారికి నకిలీ విత్తనాలు అంటగడుతున్నారు దళారులు.

పత్తి చేనులో కలుపు తీయడం ఖర్చుతో కూడుకున్న పని. కూలీల కొరత, ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. సరిగ్గా ఇదే అంశాన్ని ఆసరాగా చేసుకొని కొందరు కలుపు మందును తట్టుకునే రకమంటూ విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. ఇలాంటి వారి విషయంలో కఠినంగా ఉంటామని అధికారులు చెబుతున్నా… ఎక్కడా చర్యలు తీసుకున్న ఘటనలు కనిపించడం లేదు. దీంతో సంగారెడ్డి జిల్లాలోని చాలాచోట్ల బహిరంగంగానే ఇలాంటి విత్తనాల అమ్మకాలు సాగుతున్నాయి. జూన్ లో హత్నూరలో… తాజాగా పటాన్ చెరు మండలంలో వెలుగు చూసిన ఘటనలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

పటాన్ చెరు మండలం పెద్దకంజర్లకు చెందిన రేషన్ డీలర్ బుచ్చిరెడ్డి వందల సంఖ్యలో పత్తి విత్తన ప్యాకెట్లతో పాటు మామూలు సంచుల్లోనూ విత్తనాలను తెచ్చి రైతులకు అమ్మాడు. సుల్తాన్ పూర్, చిన్నకంజర్ల, కొన్యాల, ఐనవోలు, కోనంపేట, ఆమ్దూరు, బచ్చుగూడెం లాంటి గ్రామాల రైతులు బుచ్చిరెడ్డి దగ్గర విత్తనాలు కొన్నారు. కలుపు తీసే బాధ ఉండదని… రసాయన మందులు పిచికారీ చేస్తే సరిపోతుందంటూ ఆకర్షించారు దళారులు. దీంతో వందల కిలోల పత్తి విత్తనాలను కొనుగోలు చేసి పంటలు వేశారు. మొలకలు సరిగా పెరగకపోవడం…మందు పిచికారి చేస్తే.. ఎండిపోవడంతో మోసపోయామని గుర్తించామంటున్నారు రైతులు.
పెద్దకంజర్లలోనే దాదాపు వంద మందికి పైగా రైతులు బుచ్చిరెడ్డి దగ్గర కొన్న విత్తనాలతో పత్తి సాగు చేశారు. వీరిలో చాలా మందికి కొంత భూమి ఉండగా.. మరికొందరు కౌలుకు తీసుకుని పత్తిసాగు చేశారు. ఇప్పటికే ఎకరాకు 35 వేలకు పైగా ఖర్చు పెట్టామని.. అధికారులు స్పందించి తమకు నష్టపరిహారం ఇవ్వడంతో పాటు దళారులపై చర్యలు తీసుకోవాలంటున్నారు.

Posted in Uncategorized

Latest Updates