రైతు బంధు చెక్కులు, బతుకమ్మ చీరలు పంపిణీ చేయొచ్చు… సీఈఓ రజత్ కుమార్

హైదరాబాద్ : ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ మీడియాతో చిట్ చాట్ చేశారు. ఎన్నికలు, రాష్ట్రంలో పథకాల అమలుకు సంబంధించిన పలు కీలక అంశాలను వివరించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలు యధావిధిగా కొనసాగుతాయని చెప్పారు రజత్ కుమార్. రైతు బంధు చెక్కుల పంపిణీకి.. బతుకమ్మ చీరల పంపిణీకి కోడ్ అడ్డురాదన్నారు. ఈ పథకాలు అమలు చేసేందుకు కొత్త నిబంధనలు ఏమీ ఉండవన్నారు. “మాకు రైతు బంధు, బతుకమ్మ చీరల పంపిణీపై వివిధ పార్టీల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. వాటిని సీఈసీకి పంపించాం. తెలంగాణలో ఎన్నికల నిర్వహణకు అన్నీ అనుకూలంగానే ఉన్నాయి. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణ బెటర్” అని అన్నారు రజత్ కుమార్.

“ఎన్నికల కమిషన్ పారదర్శకంగా పనిచేస్తుంది. నియోజకవర్గం వారిగా ఓటర్ లిస్ట్ ను పరిశీలిస్తున్నాం. ప్రతి నియోజకవర్గంలో 13 శాతం కొత్త ఓటర్ లు పెరిగారు. కానీ భద్రాచలం లో 40 శాతం ఓటర్లు తగ్గారు. అశ్వారావుపేట లో 21 శాతం ఓటర్లు తగ్గారు. ఫామ్ 6 ద్వారా 19 లక్షల 50 వేల కొత్త ఓటర్లు అప్లై చేశారు. లక్షా యాభై వేల ఓటర్లను రిజెక్ట్ చేశాం. 40 శాతం కొత్త అప్లికేషన్లు ఉన్నాయి. 60 శాతం పాతవి” అని చెప్పారు రజత్ కుమార్.

రాష్ట్రంలో మొత్తం 4.16 లక్షల దివ్యాంగ ఓటర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు ఎన్నికల ప్రధానాధికారి.  దివ్యాంగులను ఓటర్ కేంద్రాలకు తీసుకొచ్చి.. క్యూ లేకుండా నేరుగా ఓటేసే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. “వారికి తెలుగులో బోర్డ్స్  ఏర్పాటు చేస్తున్నాం. కళ్ళు లేనివారికి బ్రెయిలీ లిపిలో ఓటర్ కార్డ్స్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. శాంతి భద్రతల కోసం అడిషనల్ డీజీని కేంద్ర ఎన్నికల కమిషన్ అపాయింట్ చేసింది. ఎన్నికల సమాచారం కోసం.. 1950 నంబర్ కు రోజు 1400 కాల్స్ వస్తున్నాయి” అని చెప్పారు రాష్ట్ర సీఈసీ రజత్ కుమార్.

Posted in Uncategorized

Latest Updates