రోటోమాక్ కుంభకోణం: 800 కోట్లు కాదు..3,695 కోట్లు

kotariరోటొమాక్‌ కుంభకోణం జరిగింది రూ.800 కోట్లు కాదని, రూ.3,695 కోట్లని సీబీఐ దర్యాప్తులో తేలింది.  ఆ కంపెనీ అధినేత విక్రమ్‌ కొఠారీ చేసిన కుంభకోణం మామూలు కాదని.. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఫిర్యాదుతో మొదట రూ.800 కోట్లుగా తెలిపిన అధికారులు…ఏడు బ్యాంకుల నుంచి 2,919 కోట్ల రుణం తీసుకుంటే వడ్డీలతో కలిపి అది 3,695 కోట్లయిందని తేల్చారు. తాను డీఫాల్టర్‌ను కాదని, తన కంపెనీని బ్యాంకులు ఎన్‌పీఏగా మాత్రమే ప్రకటించాయని కొఠారీ ఇప్పటికీ దబాయిస్తున్నారు. పీఎన్‌బీని రూ.11,400 కోట్ల వరకు ముంచేసి.. దేశం వదిలి పరారైన నీరవ్‌ మోడీ బాటలోనే.. ఆయన కూడా ఏడు బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకుని.. పైసా కూడా చెల్లించకుండా ఎగగొట్టారు. దీంతో సీబీఐ, ఈడీ కొరడా ఝళిపించాయి. ఆయనపై వేర్వేరుగా కేసులు నమోదు చేశాయి.

సోమవారం(ఫిబ్రవరి-19) ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఉన్న రొటమాక్‌ గ్లోబల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆఫీసు, కొఠారీ ఇళ్లలోCBI విస్తృతంగా సోదాలు నిర్వహించింది. ఈ సందర్భంగా దొరికిన డాక్యుమెంట్స్ పరిశీలించగా.. 2008 నుంచి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, అలహాబాద్‌ బ్యాంక్‌, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ల నుంచి రూ.2919 కోట్ల వరకు0 రుణాలు తీసుకున్నట్లు తేలింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా చేసిన ఫిర్యాదుతో కాన్పూర్‌లోని రొటమాక్‌ గ్లోబల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, సీఎండీ కొఠారీ, ఆయన భార్య సాధనా కొఠారీ, కుమారుడు రాహుల్‌ కొఠారీలతో పాటు గుర్తుతెలియని బ్యాంక్‌ అధికారులపై సీబీఐ FIR నమోదు చేసింది. ఆ వెంటనే కాన్పూర్‌లోని కొఠారీ ఇల్లు, ఆఫీసుల్లో దాడులు నిర్వహించింది. కొఠారీలను ప్రశ్నించింది.

అయితే ఇంతవరకు అరెస్టులు చేయలేదని సీబీఐ అధికార ప్రతినిధి అభిషేక్‌ దయాల్‌ తెలిపారు. ప్రస్తుతం కొఠారీలను విచారిస్తున్నట్లు తెలిపారు. ఎగుమతి ఆర్డర్ల కోసం తీసుకున్న రుణాలను కొఠారీ వేరే ఆఫ్‌షోర్‌ కంపెనీకి మళ్లించినట్లు సీబీఐ ఆరోపించింది. ఆ తర్వాత ఆ సొమ్మును తిరిగి కాన్పూర్‌లోని తన కంపెనీ ఖాతాకు జమ చేసినట్లు తెలిపింది.

సీబీఐకి సమాంతరంగా ఈడీ కూడా రంగంలోకి దిగింది. మనీలాండరింగ్‌ కింద కొఠారీలపై కేసు నమోదు చేసింది. తాను దేశం విడిచి పారిపోయినట్లు వస్తున్న వార్తలను కొఠారీ ఖండించారు. తాను కాన్పూర్‌లోనే ఉన్నానని, ఎలాంటి తప్పూ చేయలేదని ఓ ప్రకటనలో తెలిపారు. దీన్ని కుంభకోణంగా చూడవద్దన్న కొఠారీ.. తీసుకున్న రుణాలను త్వరలోనే తిరిగి చెల్లిస్తానని ప్రకటించారు.

Posted in Uncategorized

Latest Updates