రోడ్లకు ఇరువైపుల ఉన్న బావులను తొలగించండి

Road-wellsఅతి వేగం, గమ్యాన్ని చేరాలన్న తొందర, ముందు వెళ్లే వాహనాలను ఓవర్ టేకే చేసే ప్రయత్నం…కారణం ఏదైనా తరుచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వాహనాలు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న బావులు, కందకాల్లో పడిపోయి…పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరుగుతోంది. దీంతో రోడ్లకు ఇరువైపులా ఉన్న బావులను తొలగించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.

రోడ్డు పక్కన ఉన్న బావులు.. వాహనదారులకు, ప్రయాణికులకు ప్రాణసంకటంగా మారుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో అనేక వ్యవసాయ బావులు రోడ్లను ఆనుకుని ఉన్నా.. వాహనదారులను హెచ్చరిస్తూ ఎక్కడా సైన్ బోర్డులు కనిపించటం లేదు. అధికారులు వాటిని పట్టించుకోకపోవటంతో.. జిల్లాలో ఏటా ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. కొద్ది రోజుల క్రితం వరంగల్ నుంచి వస్తున్న కారు.. సింగాపూర్ దగ్గర అదుపు తప్పి బావిలో పడటంతో తాత, మనవడు మృతిచెందారు. గతంలో మల్యాల మండలం రాంపూర్ శివారులో రోడ్డు పక్కనున్న వ్యవసాయ బావిలో ఆర్టీసీ బస్సు పడిన ఘటనలో 22 మంది చనిపోయారు. గతేడాది కోహెడ సమీపంలో కారు బావిలో పడిన ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే… అనేక ఘటనల్లో ప్రమాదాలకు వ్యవసాయ బావులే ప్రధాన కారణమవుతున్నాయి.

కరీంనగర్ మానకొండూరు మీదుగా జమ్మికుంట వెళ్లే మార్గంలో రోడ్ల పక్కన బావులు ఎక్కువగా ఉన్నాయి. కరీంనగర్ టూ సింగాపూర్ మీదుగా హుజురాబాద్-వరంగల్ మార్గంలోనూ అనేక బావులు రోడ్డును అనుకునే ఉన్నాయి. హుజూరాబాద్-సైదాపూర్ మార్గంలో.. జమ్మికుంట నుంచి చుట్టు పక్కల గ్రామాలకు వెళ్లే రహదారుల పక్కన కూడా లోతైన బావులున్నాయి. గమ్యం చేరుకోవాలన్న తొందరలో.. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా,  ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించే ప్రయత్నంలోనూ వాహనాలు బావుల్లో పడిపోతున్నాయి. రోడ్ల పక్కనున్న వ్యవసాయ బావులకు పటిష్ఠమైన రక్షణ గోడలు లేకపోవటం.. ఇక్కడ బావులున్నాయనే సూచికలు ఏర్పాటు చేయకపోవటం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని అంటున్నారు వాహనదారులు.

ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి చేయటం, అక్కడక్కడ బావుల దగ్గర సైన్ బోర్డులు ఏర్పాటు చేయటం, ఆ తర్వాత మర్చిపోవడం కామన్ గా మారింది.

Posted in Uncategorized

Latest Updates