ర్యాగింగ్ భూతం : కర్నూలులో మెడికో ఆత్మహత్య

praneethర్యాగింగ్ భూతంకు హర్షప్రణీత్ రెడ్డి బలయ్యాడా ! గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు…కళాశాల యాజమాన్యం ఎందుకు ఉలిక్కి పడుతుంది…రాత్రి 11.30 గంటలకు నిద్రపోవడానికి తన గదికి వెళ్ళిన హర్షప్రణీత్ ను ఆ సమయంలో సహవిద్యార్థులు ఎందుకు లేపాల్సివచ్చింది…అనే అనుమానం ప్రతి ఒక్కరిలో కలిగింది. ఇక్కడ ర్యాగింగ్‌ వేధింపులు తట్టుకోలేక తన కొడుకు చనిపోయాడని, ర్యాగింగ్ చేసిన విద్యార్థులతో పాటు కళాశాల యాజమాన్యాన్ని కూడా శిక్షించాలంటూ బోరున విలపించాడు రామాంజులరెడ్డి.

కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థి కొమ్మ హర్షప్రణీత్‌ రెడ్డి (18) మొన్న(గురువారం- జులై 5) అర్ధరాత్రి హాస్టల్ లో  ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఆత్మహత్యపై అనుమానం ఉందని విద్యార్థి తండ్రి రామాంజులరెడ్డి ఫిర్యాదు చేశాడు. దీనితో  అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు పోలీసులు. కడపకు చెందిన కోర్టు క్లర్కు రామాంజులరెడ్డి, వసంతలక్ష్మీ దంపతుల రెండో కుమారుడు హర్షప్రణీత్‌ గత ఏడాది కర్నూలు వైద్య కళాశాలలో చేరాడు. రాజ్‌విహార్‌లోని కళాశాల వసతిగృహంలో ఉంటున్నాడు. ఈ నెల 10 నుంచి ప్రధాన పరీక్షలు ఉండటంతో మొదటి సంవత్సరం విద్యార్థులంతా వసతిగృహంలోనే వేర్వేరుచోట్ల చదువుకుంటున్నారు. గురువారం రాత్రి 11.30 సమయంలో తన గదిలోకి వెళ్లిన హర్షప్రణీత్‌ రెడ్డి గంట తర్వాత కూడా బయటకు రాకపోవడంతో సహ విద్యార్థులు వచ్చి తలుపుతట్టారు…అయినా ఆయన తలుపు తీయలేదు. అనుమానం వచ్చి విద్యార్థులు కిటికీలోంచి చూశాం. లోపల ఫ్యాన్‌కు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించడంతో తలుపు పగలకొట్టి కిందకు దించి సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు చెప్పారు వైద్యులు.

డీఎస్పీ యుగంధర్‌బాబు, సీఐ మురళీధర్‌రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వసతిగృహంలో సీసీ కెమెరాల ఫుటేజిని పరిశీలించి ఆత్మహత్య అని ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చారు. హర్ష నాలుగు రోజుల నుంచి ముభావంగా ఉంటున్నాడని, చదువు ఒత్తిడే ఆత్మహత్యకు కారణం కావచ్చని సహ విద్యార్థులు చెబుతున్నారు.  ఈ ఘటనకు ర్యాగింగ్‌ కారణం కాదని కళాశాల ప్రిన్సిపల్‌ డా.రాంప్రసాద్‌ చెప్పారు. లాక్‌లో ఉన్న విద్యార్థి చరవాణిని పరిశీలిస్తే కారణం తెలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు పోలీసులు.

ఇదిలా ఉండగా తన కొడుకును హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించి ఉంటారని అనుమానం వ్యక్తంచేశారు రామాంజులరెడ్డి. కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, తమకు ఆలస్యంగా సమాచారం ఇచ్చారని ఆరోపించారు. తనయుడి మృతదేహాన్ని చూసి రామాంజులరెడ్డి శోకసంద్రంలో మునిగిపోయారు. తన కొడుకు ఆత్మహత్య చేసుకోలేదని, ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు. మొదటి నుంచి మెరిట్‌ స్టూడెంట్‌. అన్ని సర్టిఫికెట్లు తెచ్చి చూపిస్తా…కానీ  ఈ ఘటనకు బాధ్యులైన వారిని పట్టుకొని ఈలాంటి సంఘటన పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ప్రాధేయపడ్డాడు రామాంజులరెడ్డి.

Posted in Uncategorized

Latest Updates