లాల్‌దర్వాజా బోనాలు ప్రారంభం

తెలంగాణలో ప్రసిద్ధి చెందిన లాల్‌దర్వాజా బోనాల ఉత్సవాలు నిన్న(శుక్రవారం..జూలై27న) ఘనంగా ప్రారంభమయ్యాయి. లాల్‌దర్వాజా శ్రీ సింహ వాహినీ మహంకాళి దేవాలయంలో పదకొండు రోజుల పాటు ఈ బోనాల ఉత్సవాలు కొనసాగుతాయి. ఈ ఉత్సవాలను ధ్వజారోహణం, శిఖరపూజ నిర్వహించి ప్రారంభించారు నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి ముఖ్య అతిథిగా వచ్చిన పోలీస్‌ కమిషనర్‌కు ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. అంతకు ముందు ఆలయంలో గణపతి హోమం, దేవి అభిషేకం, సప్తశతి పారాయణం జరిగాయి. ఈ సందర్భంగా అంజనీకుమార్‌ మాట్లాడుతూ ప్రతి ఏటా ఘనంగా నిర్వహించే లాల్‌దర్వాజా బోనాల ఉత్సవాలకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. మతసామరస్యానికి ప్రతీకగా ప్రశాంత వాతావరణంలో, భక్తి శ్రద్ధలతో ఉత్సవాలను జరుపుకోవాలని సూచించారు ఆయన. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ చూడాలన్నారు. పాతనగరంలో జరిగే బోనాల ఉత్సవాలకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ఆలయంలో గత 110 ఏళ్లుగా ఈ ఉత్సవాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ ప్రతినిధులు కమిషనర్‌కు వివరించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు కమిషనర్‌ను శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ, ట్రాఫిక్‌ డీసీపీ బాబూరావు, టాస్క్‌ఫోర్స్‌ అదనపు డీసీపీ చైతన్యకుమార్‌, ఫలక్‌నుమా ఏసీపీ సయ్యద్‌ ఫయాజ్‌, ఛత్రినాక ఇన్‌స్పెక్టర్‌ కె.మనోజ్‌కుమార్‌, ఆలయ కమిటీ ఛైర్మన్‌ పి.వై.కైలాష్‌వీర్‌, ప్రతినిధులు జి, మహేశ్‌గౌడ్‌, మాణిక్‌ప్రభుగౌడ్‌, కె.వెంకటేశ్‌, సి.రాజ్‌కుమార్‌ యాదవ్‌, కాశీనాథ్‌గౌడ్‌, బల్వంత్‌యాదవ్‌, శీరా రాజ్‌కుమార్‌, నర్సింగరావు, బంగ్ల రాజుయాదవ్‌ పాల్గొన్నారు.

Posted in Uncategorized

Latest Updates