లోకల్ ఐడియా : నిజామాబాద్ లో అద్దెకి హెల్మెట్లు

HELMETప్రమాదాల నివారణకు హెల్మెట్ ధరించమని… ట్రాఫిక్ సిబ్బంది ప్రచారం చేయడమో, హెల్మెట్ పెట్టుకోని వారికి ఫైన్లు వేయడమో చూస్తుంటాం. అయినా వాహనదారుల్లో అవగాహన రాకపోవడం చూసిన ఓ ఊరి జనం…వెరైటీ ఆలోచన చేశారు. హెల్మెట్ అవసరాన్ని వివరిస్తూ…ఆ ఊరిలో ఉన్న వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లను అద్దెకు ఇస్తూ ఆకట్టుకుంటున్నారు.

నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండలం బషీరాబాద్ గ్రామం ఎప్పుడు పంట పొలాలతో పచ్చగా కలకళలాడుతూ ఉంటుంది. పసుపు పంటను ఎక్కువగా సాగు చేస్తారు ఇక్కడి రైతులు. దీంతో ఊరిలో ఆదాయానికి కొదవలేదు. పైగా గ్రామానికి చెందిన చాలామంది యువకులు ఉపాధి కోసం బయటి దేశాల్లో ఉంటున్నారు. అయితే 2015లో ఊరికి చెందిన ముగ్గురు యువకులు బైక్ పై వెళ్తూ…యాక్సిడెంట్ లో చనిపోవడం గ్రామస్థులను కలిచివేసింది. ప్రమాదంపై విదేశాల్లో ఉంటున్న యువత తీవ్రంగా స్పందించారు. ఊరిలో మరే యువకులు ఇలా చనిపోవద్దని భావించి ఊరిలో వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లు అద్దెకు ఇచ్చేలా చర్యలు చేపట్టారు.

ముందుగా గ్రామానికి చెందిన ఓ కిరాణా వ్యాపారితో మాట్లాడి అతనికి 10 హెల్మెట్లు కొనిచ్చారు యువకులు. గ్రామం నుంచి ఏ వ్యక్తయిన పనుల మీద బయటికి వెళ్తే…వ్యాపారి దగ్గరి నుంచి హెల్మెట్ తీసుకెళ్లి తిరిగి రాగానే ఇచ్చేలా ప్లాన్ చేశారు. ఇందుకోసం ఓ రిజిష్టర్ ను ఏర్పాటు చేసి…హెల్మెట్ తీసుకునే వారి పేరు, అడ్రస్, ఫోన్ నంబర్ నమోదు చేసుకుంటున్నారు. పది హెల్మెట్లతో ప్రారంభించగా … ఇప్పుడు  50 హెల్మెట్లు  అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం వీటికి డిమాండ్ పెరగడంతో మరో 30 హెల్మెట్లకు ఆర్డర్ ఇచ్చారు యువకులు.

ఇక్కడ ఎలాంటి డబ్బులు లేకుండా హెల్మెట్ ను అద్దెకివ్వడం బాగుందంటున్నారు స్థానికులు. ప్రాణాలు నిలబెట్టేందుకు యువత చేస్తున్న సేవ స్పూర్తినిస్తోందంటున్నారు. బషీరాబాద్ యువతను ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలోని మిగితా గ్రామాలకి ఇలాంటి సేవలు విస్తరించాలని కోరుతున్నారు జనం. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసి ప్రాణాలు కోల్పోతున్న యువతకు దాని ప్రాముఖ్యాన్ని వివరించి హెల్మెట్ అందించడం గొప్పవిషయమంటున్నారు.

Posted in Uncategorized

Latest Updates