లోగుట్టు పెరుమాళ్లకెరుక : ఉడిపి పీఠాధిపతి శ్రీలక్ష్మీవర తీర్థపై విష ప్రయోగం జరిగిందా?

ఉడిపి అనగానే శీరూర్ మఠం గుర్తుకొస్తుంది. కర్నాటకలోని శీరూర్ పీఠానికి ఎంతో విశిష్ఠత, ఉన్నతి ఉంది. పీఠాధిపతి అయిన శ్రీలక్ష్మీవర తీర్థ (55) అంటే దేవుడితో సమానంగా పూజిస్తారు భక్తులు. ఆయన అకాల మరణం ఇప్పుడు దేశాన్ని నివ్వెరపరిచింది. ఎంతో ఆరోగ్యంగా ఉండే స్వామి.. ఒక్కసారి అనారోగ్యానికి గురవ్వటం, ఆ వెంటనే ఆస్పత్రిలో చనిపోవటంపై భక్తుల్లో ఎన్నో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అతని లాయర్ అయితే స్వామీజిపై విష ప్రయోగం జరిగిందని బహిరంగంగానే అనుమానాలు వ్యక్తం చేశారు. మఠంలో ఎవరికీ కానీ ఫుడ్ పాయిజన్.. ఎంతో నిష్ఠగా ఉండే స్వామీజీ ఎలా అవుతుంది అనే ప్రశ్న లేవనెత్తారు. దీని వెనక కుట్ర ఉంది అంటున్నారు.

శ్రీలక్ష్మీవర తీర్థ జూలై 18వ తేదీ రాత్రి అనారోగ్యానికి గురయ్యారు. ఆయన్ను మణిపాల్ లోని KMC ఆస్పత్రికి తరలించారు. వెంటిలేషన్ పై ఉన్న స్వామి.. గురువారం ఉదయం చనిపోయారు. చికిత్స చేసిన వైద్యులు కూడా శ్రీలక్ష్మీవర తీర్థ లాయర్ లేవనెత్తిన అనుమానాలతో ఏకీభవిస్తున్నారు. విషపూరితం అయిన ఆహారం తీసుకోవటం వల్లే స్వామీజి చనిపోయారని చెబుతున్నారు. దీని వెనక మిగతా మఠాలకు చెందిన కొందరి హస్తం ఉంది అనేది స్వామిజీ భక్తుల, మఠంలోని ఓ వర్గం వాదన.

ఉడిపి పీఠంలోని ఓ దేవుడి విగ్రహాన్ని కొన్ని రోజుల క్రితం మరో మఠానికి ఇచ్చారు స్వామిజీ. తిరిగి ఆ విగ్రహాన్ని మఠానికి తీసుకువచ్చే విషయంలో విభేదాలు తలెత్తాయి. దేవుడి విగ్రహం తిరిగి ఇచ్చే విధంగా మిగతా మఠాధిపతులు అంగీకరించలేదు. ఈ విషయంలో ఆరు మఠాలపై కేసులు కూడా వేయాలని నిర్ణయించినట్లు స్వామిజీ లాయర్ రవికిరణ్ చెబుతున్నారు. తనను ఏమైనా చేయొచ్చని కూడా అనుమానాలు వ్యక్తం చేసినట్లు కూడా చెబుతున్నారు. స్వామిజీకి విష ప్రయోగంపై ఉన్నతస్థాయి విచారణ చేపట్టాలని, నిజాలు నిగ్గుతేల్చాలని డిమాండ్ చేస్తున్నారు లాయర్.

Posted in Uncategorized

Latest Updates