వచ్చేఅకాడమిక్ ఇయర్ కు కొత్త టీచర్లు: కడియం

KADIYAMఉపాధ్యాయుల భర్తీని వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి. వచ్చే అకడమిక్ ఇయర్ లో స్కూళ్లు ప్రారంభం అయ్యే వరకు కొత్త టీచర్లు విధుల్లో చేరుతారన్నారు. విద్యాశాఖలో ఉన్న ఖాళీల భర్తీ ప్రక్రియను ఇప్పటికే చేపట్టామన్నారు. 8,792 టీచర్ పోస్టుల భర్తీకి పరీక్షల షెడ్యూల్ కూడా వచ్చిందని… త్వరలోనే పరీక్షలను నిర్వహించ నున్నట్లు తెలిపారు. ఆ తర్వాత వెంటనే ఫలితాలను కూడా ప్రకటించనున్నట్లు తెలిపారు.

కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని SRNK ప్రభుత్వ డిగ్రీ కాలేజీ 20వ వార్షికోత్సవం మంగళవారం(ఫిబ్రవరి-6) జరిగింది. ఈ కార్యక్రమంలో కడియం శ్రీహరి పాల్గొన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ విద్యను, వర్శిటీలను పటిష్టం చేస్తోందన్నారు. విశ్వవిద్యాలయాల్లో 1551 ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేసేందుకు సీఎం కేసీఆర్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్పారు. వర్శిటీల్లో మౌలిక వసతుల కల్పన కోసం 420 కోట్ల రూపాయలు మంజూరు చేశారన్నారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చడంలో విద్యాశాఖ పాత్ర ముఖ్యమైందని… తెలంగాణ వచ్చాక ఆన్‌లైన్ అడ్మిషన్లు చేపడుతున్నట్లు తెలిపారు కడియం.

ప్రభుత్వం కల్పించిన ఈ వసతులన్నింటినీ విద్యార్థులు అందిపుచ్చుకుని ఉన్నత స్థానాలకు వెళ్లాలని సూచించారు. విదేశాల్లో విద్యనభ్యసించేందుకు కూడా ప్రభుత్వం రూ. 20 లక్షలను ఇస్తున్నట్లు తెలిపారు. కాలేజీ వార్షికోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి కడియం కాలేజీపై వరాలు ప్రకటించారు. కాలేజీకి అభివృద్ధికి రూ. 10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. పీజీ బ్లాక్ నిర్మాణం కోసం, అదేవిధంగా కోచింగ్ సెంటర్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు మంత్రి కడియం శ్రీహరి.

Posted in Uncategorized

Latest Updates