వచ్చేశాను.. ఇక కుమ్మరిస్తాను : కేరళను తాకిన నైరుతి

kerala-moonsoon

భారతదేశానికి చల్లని కబురు. నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. అధికారికంగా ప్రకటించింది భారత వాతావరణ శాఖ. ఉదయం 11.30 గంటలకు విడుదల చేసిన వెదర్ బులిటెన్ లో ఈ విషయాన్ని వెల్లడించింది. జూన్ 1వ తేదీకి నైరుతి ప్రవేశించొచ్చు అని గతంలో వాతావరణ శాఖ ప్రకటించింది. అయతే అనుకున్న టైం కంటే మూడు రోజుల ముందుగానే దేశంలోకి ప్రవేశించాయి రుతుపవనాలు.

అరేబియా సముద్రం నుంచి కొమరిన్ ప్రాంతం మొత్తం ఈ రుతుపవనాలు విస్తరించాయి. దేశంలోకి నైరుతి రుతుపవనాలు రాకను ఈ విధంగా గుర్తించింది వాతావరణ శాఖ. కేరళలోని మినికోయ్, అమిని, తిరువనంతపురం, పునలూర్, కొల్లాం, అల్లపుజ, కొట్టాయం, కొచి, త్రిశూర్, కోచికోడ్, కాన్నూర్, తలశెరి, కుడులు, మంగళూర్ ప్రాంతాల్లో 48 గంటల్లో 2.5మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. ఈ 14 ప్రాంతాల్లో పడిన వర్షపాతం ఆధారంగా భారతదేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు కూడా విస్తరించినట్లు చెబుతున్నారు.

రుతుపవనాలు విస్తరణ ఈసారి చురుగ్గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. జూన్ 7, 8 తేదీల్లో తెలంగాణలోకి ప్రవేశించొచ్చు. ఇప్పటికే తమిళనాడులోని కొన్ని ప్రాంతాల వరకు విస్తరించి ఉండటంతో.. అనుకున్న సమయం కంటే.. ఒకటి, రెండు రోజుల ముందుగానే రావొచ్చని కూడా చెబుతున్నారు. ప్రస్తుతం రుతుపవనాల విస్తరణకు అనుకూలమైన వాతావరణం ఉందని కూడా చెబుతున్నారు అధికారులు. ఈసారి మంచి వర్షాలు పడతాయంటున్నారు.

Posted in Uncategorized

Latest Updates