వచ్చేస్తాం.. ప్లీజ్ హెల్ఫ్ : NRI భార్యల ఆర్తనాదాలు

court-marriage1-768x454

అబ్బాయి ఎలాంటి వాడో అనవసరం.. కనీసం ఎంక్వయిరీ కూడా చేయరు.. విదేశీ అల్లుడు అయితే చాలు.. వేలంపాట పాడినట్లు కోట్లకు కోట్లు కట్నాలు ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. NRI సంబంధం అయితే చాలు.. ముందూ వెనకా చూడకుండా పిల్లను ఇచ్చేస్తున్నారు. ఆ తర్వాత ఫ్లయిట్ ఎక్కి.. విదేశాలకు వెళ్లిన తర్వాత బాగోతం బయటపడుతుంది. NRI పెళ్లి సంబంధాల్లో అమ్మాయిల ఆర్తనాదాలు ఇప్పుడు ఇండియాకి వినిపిస్తున్నాయి. బాధలు పడలేకపోతున్నాం.. ఇండియా వచ్చేస్తాం.. ప్లీజ్ హెల్ఫ్ అంటూ ఫోన్ల ద్వారా తల్లిదండ్రులను వేడుకుంటున్న అమ్మాయిల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.

ఇటీవల ఈ సంఖ్య మరింత పెరిగింది. ఎంతలా అంటే.. ప్రతి 8 నిమిషాలకు ఓ NRI మహిళ సాయం కోసం ఫోన్ చేస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. భర్త నిర్లక్ష్యం, చిత్రహింసలు, వేధింపులు, అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకోవటం ద్వారా వచ్చే ఇబ్బందులు.. ఇలాంటి కారణాలతో వారి మధ్య సఖ్యత ఉండటం లేదంట. ఇంటికి తిరిగి వచ్చేస్తాం అని ఫోన్లలో తల్లిదండ్రులను వేడుకుంటున్నారు.

జనవరి 1, 2015 నుంచి నవంబర్‌ 30, 2017 మధ్య ఇలాంటి ఫిర్యాదులు 3వేల328 వచ్చాయని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు వెల్లడించింది. ఇలాంటి ఫోన్లు వస్తున్న రాష్ట్రాల్లో పంజాబ్‌ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. సెకండ్ ప్లేస్ ఆంద్రప్రదేశ్. మూడు, నాలుగు స్థానాల్లో తెలంగాణ, గుజరాత్‌ రాష్ట్రాలు ఉన్నాయి. వరకట్న వేధింపులు ఆంధ్ర, తెలంగాణ వాళ్లే ఎక్కువగా ఉన్నాయని వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయ ఉద్యోగి ఆరతిరావు వివరించారు. వరకట్న వ్యవస్థ బలంగా ఉన్న ఏపీ, తెలంగాణలోనే ఈ పరిస్థితి అధికంగా ఉందని చెప్పారు. NRIలు తమ స్వస్థలాలకు తల్లితండ్రులు చూసిన అమ్మాయిలను పెళ్లి చేసుకుంటున్నారని.. తిరిగి వచ్చిన తర్వాత వారితో కలిసి ఉండేందుకు ఇష్టపడటంలేదని తెలిపారు. అదనపు కట్నం, ఇతరత్రా కోరికలతో భార్యలను వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. NRI సంబంధాలపై భారత తల్లితండ్రులకున్న మోజు కూడా ఈ పరిస్థితికి కారణం అని చెబుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates