వచ్చే నెల 15 నుంచి ఉచిత కంటి పరీక్షలు

LAXMA REDDYవచ్చే నెల 15వ తేదీ నుంచి ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తామన్నారు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి. ఈ సందర్భంగా అవసరమైన వారికి కళ్లద్దాలు ఉచితంగా అందిస్తామన్నారు ఆయన. ప్రభుత్వం ఉచితంగా అందించే కళ్లద్దాల కోసం బహిరంగ టెండర్లను ఆహ్వానించామని, మల్టీ నేషనల్‌ కంపెనీ ఎస్సెల్లార్‌ సంస్థ అతి తక్కువ ధరకు (ఎల్‌-1) కళ్లాద్దాలను సమకూర్చటానికి ముందుకు వచ్చిందని చెప్పారు మంత్రి. రాష్ట్రంలో 40 లక్షల మందికి కళ్లద్దాల అవసరం ఉంటుందని చెప్పారు. లయన్స్‌ క్లబ్‌, ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రి వంటి స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా సేవలు అందించటానికి ముందుకు వస్తే, వినియోగించుకోవటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

ఎంసీఐ మార్గదర్శకాలు, గతంలో కోర్టు ముందు అంగీకరించిన మేరకు ఇన్‌ సర్వీసు వైద్యులకు పీజీ అడ్మిషన్లలో వెయిటేజీ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, వీటిని ప్రభుత్వ వైద్యులు వ్యతిరేకించటం తగదన్నారు. పైగా ఇన్‌ సర్వీసు వైద్యులకు పీజీ అడ్మిషన్లలో వెయిటేజీ కాకుండా తిరిగి రిజర్వేషన్లు కోరుతూ వారు కోర్టుకు కూడా వెళ్లారని, ఈ కేసు కోర్టులో పెండింగ్‌లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకుంటుందని ప్రశ్నించారు. ఈ విషయాన్ని ఇన్‌ సర్వీసు వైద్యులు సమ్మెకు ఒక కారణంగా చూపటం సరికాదన్నారు. ఈ ఒక్క అంశం మినహా ప్రభుత్వ వైద్యుల సమస్యలన్నింటినీ పరిష్కరించటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు లక్ష్మారెడ్డి.

Posted in Uncategorized

Latest Updates