వడగండ్ల వాన: అన్నదాతను ముంచిన అకాల వర్షాలు

rain-telanganaఅకాల వర్షం, వడగండ్ల వాన అన్నదాతలకు కడగండ్లు మిగిల్చాయి. చేతికొచ్చిన పంటలు నీట మునగడంతో రైతులకు తీరని కష్టం, నష్టం మిగిలింది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 16 జిల్లాల్లో దాదాపు లక్ష ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఒక్క వరి పంటే 72 వేల ఎకరాల్లో దెబ్బతింది. ఒకటి, రెండు రోజుల్లో రైతులు వరి కోతకు సిద్ధమయ్యారు. ఇంతలోనే అకాల వర్షాలు పంటలను ముంచేయడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 15 వేల ఎకరాల్లో మొక్కజొన్నకు నష్టం వాటిల్లింది. 7,500 ఎకరాల్లో మామిడి కాయలు రాలిపోయాయి.

బత్తాయి, నిమ్మ తోటలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. అత్యధికంగా నల్లగొండలో 32 వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్టు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. ఖమ్మం జిల్లాలో 29 వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. మరోవైపు అనేకచోట్ల గ్రీన్‌హౌస్‌ కట్టడాలు కూలిపోయాయి. వడగండ్లు పడడంతో చాలావరకు దెబ్బతిన్నాయి. దీంతో అందులో వేసిన పూలు, కూరగాయల తోటలకు నష్టం వాటిల్లింది.

రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు, వడగండ్ల వానలు కురుస్తుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. వర్షాల కారణంగా జరిగిన పంట నష్టాన్ని వెంటనే అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలన్నారు. గత 15 రోజులుగా వర్షాల వల్ల జరిగిన పంట నష్టాన్ని, రాబోయే రోజుల్లో పడే వర్షాలతో కలిగే నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశించారు. నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, నివేదికలు వెంటనే పంపించాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో సీఎస్‌ అన్ని జిల్లాల కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడారు.

పంట నష్టాన్ని అంచనా వేసి పంపాలని సూచించారు. అధి కార బృందాలు తక్షణం గ్రామాల్లో పర్యటించాలన్నారు సీఎం. దీంతో వ్యవసాయశాఖ అధికారులు గ్రామాల్లో పర్యటించి అంచనా నివేదికలను రూపొందిస్తున్నారు. పంట నష్టాన్ని అంచనా వేశాక కేంద్రానికి పంపుతామని అధికారులు తెలిపారు.

పలు జిల్లాల్లో సోమవారం గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులు, వడగండ్ల వర్షంతో వరి, అరటి, మొక్కజొన్న, మామిడి తోటలు నేలకొరిగాయి. వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఈదురుగాలులకు స్తంభాలు నేలకొరగడంతో పలుచోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది.

కోదాడ మండలం ఎర్రవరంలో మొక్కజొన్న నష్టాన్ని చూసి తట్టుకోలేక కౌలు రైతు బంటు హుస్సేన్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నేరేడుచర్ల మండలం దాసారంలో పొలం పనులు చేస్తుండగా తాటి చెట్టు కూలి కోటా మట్టయ్య (25) అనే రైతు మృతి చెందాడు. తుంగతుర్తి మండలం కొత్తగూడెంలో 80 సైబీరియన్‌ కొంగలు మృత్యువాత పడ్డాయి. తిరుమలగిరి మండలం మాలిపురంలో కోళ్లషెడ్డు ధ్వంసమవడంతో వెయ్యి కోళ్లు చనిపోయాయి.

మహబూబ్‌నగర్ జిల్లాలో పలు మండలాల్లో పెద్ద ఎత్తున ఈదురుగాలులతో పాటు వడగండ్ల వర్షం కురిసింది. వికారాబాద్ జిల్లా పరిగి, దోమ, బొంరాస్‌పేట మండలాల్లో వడగండ్లు పడ్డాయి. మేడ్చల్ జిల్లా మేడ్చల్, నూతన్‌కల్, శ్రీరంగవరం, సోమారం, ఎల్లంపేట గ్రామాల్లో వడగండ్లు పడ్డాయి. గ్రేటర్‌లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మూడురోజులుగా కురుస్తున్న వానలతో వాతావరణం చల్లబడింది. అయితే అకాల వర్షాలతో రైతులతో పాటు సామాన్య జనం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.