వరంగల్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్డు : కడియం

kadiyamవరంగల్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశామన్నారు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి. భవిష్యత్ అవసరాలు, పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్, పారిశ్రామీకరణకు అనుగుణంగా ప్లాన్ ఉంటుందన్నారు. కుడా కార్యాలయంలో వరంగల్ అభివృద్ధిపై చర్చించారు. వరంగల్ ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు రివ్యూలో పాల్గొన్నారు.

వరంగల్ ఔటర్ రింగ్ రోడ్ డిపీఆర్, మాస్టర్ ప్లాన్  లపై చర్చించారు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి. హన్మకొండలోని కుడా కార్యాలయంలో అన్నిశాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు కడియం.   ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు తోపాటు రీజనల్ రింగ్ రోడ్ నిర్మించాలన్న కొత్త ప్రతిపాదనను మాస్టర్ ప్లాన్ లో చేర్చారు. సమీక్ష అనంతరం.. మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలను మీడియాకు వివరించారు కడియం శ్రీహరి. 1971లో తయారు చేసి మాస్టర్ ప్లాన్ ఇప్పటికీ అమలవుతుందని, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కొత్త మాస్టర్ ప్లాన్  రూపొందిస్తున్నామని చెప్పారు.

స్టేషన్ ఘన్ పూర్, వర్థన్నపేట, పరకాల, హుజురాబాద్, హుస్నాబాద్ నియోజకవర్గాలను కలుపుతూ 135 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్డు నిర్మించాలని నిర్ణయించామన్నారు కడియం. ధర్మసాగర్  మండలం దేవనూర్ లో క్రికెట్ స్టేడియం,  స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దేవునూర్ ఇనుప గుట్టలలో థీమ్ పార్క్, గ్రీన్ పార్క్ రీక్రియేషన్ జోన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించామన్నారు. నగరంలో 4  చెరువుల సుందరీకరణ పనులు ప్రారంభించాలని నిర్ణయించామన్నారు. నగరంలోని  6 ప్రధాన రోడ్లను మోడల్ రోడ్లుగా మార్చాలని కలెక్టర్ ను కడియం ఆదేశించారు.

మాస్టర్ ప్లాన్ దాదాపు సిద్దమైందని, త్వరలో నోటిఫికేషన్ ఇస్తామని మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి అరవింద్ కుమార్ చెప్పారు. మాస్టర్ ప్లాన్ పై ప్రజల అభిప్రాయాలు, అభ్యంతరాలు స్వీకరించడానికి 90 రోజుల సమయం ఇస్తామన్నారు.

మాస్టర్ ప్లాన్ పై  పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మార్పులు, చేర్పులపై సుధీర్ఘంగా చర్చించారు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి.

 

Posted in Uncategorized

Latest Updates