వరదల్లో తప్పిపోయిన బాలిక.. ఐదేళ్లకు ఇంటికి చేరింది

లక్నో : అల్లారు ముద్దుగా పెంచుకున్న 17 సంవత్సరాల బాలిక ఐదేళ్ల కిందట తప్పిపోయింది. ఆమె కోసం తల్లిదండ్రులు వెతకని చోటులేదు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితంలేకుండా పోయింది. ఐదు సంవత్సరాలు దాటడంతో..బతికి ఉందో లేదో అని కూతురు గుర్తొచ్చినప్పుడల్లా ఆందోళన పడేవారు. అలాంటి సమయంలో ఆ బాలిక తల్లిదండ్రుల చెంతకు చేరడంతో..ఆ కుంటుంబసభ్యులు పట్టరాని సంతోషంతో మునిగితేలారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది.

వివరాల్లోకెళితే..

ఉత్తరప్రదేశ్‌ లోని అలీగఢ్‌ కు చెందిన చంచల్‌  (మానసిక వికలాంగురాలు)ను 2013లో తల్లిదండ్రులు కేదార్‌ నాథ్‌ యాత్రకు తీసుకెళ్లారు. ఆ సమయంలో ప్రకృతి సృష్టించిన బీభత్సానికి కేదార్‌ నాథ్‌ లో ..పలు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది భక్తులు మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదంలో చంచల్‌ తప్పిపోయింది. ఆమె తండ్రి, తల్లి మాత్రం క్షేమంగా ఇంటికి చేరుకున్నారు.

ఒంటరిగా తిరుగుతున్న చంచలను జమ్ములోని ఓ అనాథాశ్రమం చేరదీసింది. నిర్వాహకులు చంచల్‌ను  ఐదేళ్లుగా ఆమె బాగోగులు చూసుకుంటున్నారు. మానసిక వికలాంగురాలైన చంచల్‌ తన స్వస్థలం గురించిన పూర్తి వివరాలు వాళ్లకు చెప్పలేకపోయింది. అయితే ఎప్పుడైనా అలీగఢ్‌ కు సంబంధించిన విషయాల గురించి చర్చించినపుడు మాత్రం ఆమెలో ఉత్సాహం కనిపించేది. ఈ విషయాన్ని గమనించిన నిర్వాహకులు.. ఆ దిశగా చంచల్‌ కుటుంబం గురించి తెలుసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

అలీగఢ్‌ కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థను సంప్రదించి, చంచల్‌ వివరాలు తెలియపరిచారు. చివరికి పోలీసుల సాయంతో ఆమెను మంగళవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. చనిపోయిందనుకున్న తన బిడ్డను క్షేమంగా అప్పగించినందుకు ఆశ్రమ నిర్వాహకులకు రుణపడి ఉంటామన్నారు బాలిక తల్లిదండ్రులు. పోలీసుల సాయం మరువలేమన్నారు.

 

 

Posted in Uncategorized

Latest Updates