వరల్డ్ కప్ ఆర్చరీ ఫైనల్ : సురేఖకు సిల్వర్

ఆర్చర్ జ్యోతి సురేఖ మరోసారి సత్తాచాటారు. వరుసగా నాలుగో ప్రపంచకప్‌ లోనూ భారత్‌ కు ప్రాతినిధ్యం వహించిన జ్యోతి సురేఖ  రెండు పతకాలను కొల్లగొట్టింది. శనివారం (జూలై-21) జరిగిన ప్రపంచకప్‌ స్టేజ్‌–4 టోర్నీలో సురేఖ, త్రిషా దేబ్, ముస్కాన్‌ లతో కూడిన భారత మహిళల జట్టు పాయింట్‌ తేడాతో స్వర్ణ పతకాన్ని చేజార్చుకుంది. ఫైనల్లో భారత్‌ 228–229తో సోఫీ డోడ్‌మోంట్, అమెలీ సాన్‌ సెనోట్, సాండ్రా హెర్వీలతో కూడిన ఫ్రాన్స్‌ జట్టు చేతిలో పరాజయం పాలై రజత పతకాన్ని దక్కించుకుంది.

నాలుగు రౌండ్‌ లపాటు జరిగిన ఫైనల్లో ఒక్కో రౌండ్‌ లో ఒక్కో జట్టు ఆరేసి బాణాలు సంధించాయి. తొలి రౌండ్‌ లో భారత్‌ 59–57తో పైచేయి సాధించగా… రెండో రౌండ్‌లో 57–59తో, మూడో రౌండ్‌లో 53–58తో వెనుకబడిపోయింది.  చివరిదైన నాలుగో రౌండ్‌లో భారత్‌ 59–55తో ఆధిపత్యం చలాయించినా ఓవరాల్‌గా ప్రత్యర్థి స్కోరుకు ఒక పాయింట్‌ దూరంలో ఉండిపోయింది.  మిక్స్‌ డ్‌  టీమ్‌ కాంస్య పతక పోరులో సురేఖ–అభిషేక్‌ వర్మ జంట 156–153తో యాసిమ్‌ బోస్టాన్‌–డెమిర్‌ ఎల్మాగాక్లి (టర్కీ) జోడీపై విజయం సాధించింది. నాలుగు రౌండ్‌ లపాటు జరిగిన ఫైనల్లో ఒక్కో రౌండ్‌ లో ఒక్కో జోడీ నాలుగేసి బాణాలు సంధించాయి.

తొలి రౌండ్‌ లో 39–40తో వెనుకబడ్డ సురేఖ–అభిషేక్‌ జంట… రెండో రౌండ్‌ లో 40–36తో… మూడో రౌండ్‌ లో 40–39తో పైచేయి సాధించింది. 119–115తో నాలుగు పాయింట్ల ఆధిక్యాన్ని సంపాదించింది. నాలుగో రౌండ్‌ లో భారత జంట 37–38తో వెనుకబడ్డా ఓవరాల్‌ గా మూడు పాయింట్ల తేడాతో విజయాన్ని దక్కించుకుంది. ఇటీవలే ప్రపంచ ర్యాంకింగ్స్‌ లో కెరీర్‌ అత్యుత్తమ ర్యాంక్‌ పదో స్థానానికి చేరుకున్న సురేఖ ఈ సీజన్‌ లో… షాంఘై ప్రపంచకప్‌ స్టేజ్‌–1 టోర్నీలో మిక్స్‌డ్‌ ఈవెంట్‌ లో కాంస్యం… అంటాల్యా ప్రపంచకప్‌ స్టేజ్‌–2 టోర్నీలో టీమ్‌ ఈవెంట్‌ లో రజతం, మిక్స్‌ డ్‌ ఈవెంట్‌ లో కాంస్యం… సాల్ట్‌ లేక్‌ సీటీ ప్రపంచకప్‌ స్టేజ్‌–3 టోర్నీ మిక్స్‌డ్‌ ఈవెంట్‌ లో కాంస్యం సాధించింది.

Posted in Uncategorized

Latest Updates