వరల్డ్ రికార్డ్ బ్రేక్ : అత్యంత ధనవంతుడిగా అమెజాన్ ఫౌండర్

ఈ కామర్స్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఆధునిక చరిత్రలో అత్యంత ధనవంతుడైన వ్యక్తిగా నిలిచారు. సోమవారం (జూలై-16) బ్లూమ్‌ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించిన వివరాల ప్రకారం.. బెజోస్ ఆస్తి 15 వేల కోట్ల డాలర్ల (రూ.10 లక్షల 25 వేల కోట్లు)కు చేరింది. రెండోస్థానంలో ఉన్న మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కంటే ఇది 5500 కోట్ల డాలర్లు ఎక్కువ కావడం విశేషం. ద్రవ్యోల్బణం లెక్కల ప్రకారం చూసుకున్నా.. జెఫ్ బెజోస్ రికార్డులను తిరగరాశారు. 1999లో బిల్ గేట్స్ వంద బిలియన్ డాలర్ల మార్క్‌ను అందుకున్నారు. ఇప్పటి లెక్కల ప్రకారం అది 14 వేల 900 కోట్ల డాలర్లకు సమానం. ఈ లెక్కన ఫోర్బ్స్ తొలిసారి 1982లో ధనవంతుల జాబితా ప్రచురించినప్పటి నుంచి తీసుకుంటే జెఫ్ బెజోసే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. సోమవారం అమెజాన్ ప్రైమ్ డే సేల్ మొదలుపెట్టే సమయానికే బెజోస్ ఈ కొత్త రికార్డులు అందుకోవడం విశేషం. కంపెనీ షేరు ధర సోమవారం అత్యధికంగా 1841.95 డాలర్ల స్థాయిని తాకింది. ఆ తర్వాత 1822.49 డాలర్ల దగ్గర ముగిసింది.

అయితే బెజోస్ సంపద 15 వేల కోట్ల డాలర్లకుపైనే ఎక్కువ కాలం ఉండటం మాత్రం సాధ్యమయ్యేలా లేదు. కానీ తొలిసారి ఈ నంబర్‌ను బెజోస్ అందుకోవడం అద్భుతమని పలువురు బడా పారిశ్రామికవేత్తలు, బిలియనీర్లు అన్నారు. అయితే బిల్ గేట్స్ 1996 నుంచి తన సంపదలో చాలా వరకు బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌కు విరాళంగా ఇస్తూ వస్తున్నారు. ఒకవేళ గేట్స్ అలా చేసి ఉండకపోతే.. ఇప్పటి వరకు ఆయన సంపద ఎప్పుడో 15 వేల కోట్ల డాలర్లకు పైనే ఉండేదని నిపుణులు చెబుతున్నారు. 1996 నుంచి ఇప్పటివరకు ఆ ఫౌండేషన్ కోసం గేట్స్ 70 కోట్ల మైక్రోసాఫ్ట్ షేర్లు, 290 కోట్ల డాలర్ల నగదును విరాళంగా ఇవ్వడం విశేషం.

Posted in Uncategorized

Latest Updates