వర్షబీభత్సం..స్తంభించిన జనజీవనం

rains-hyderabadగ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వడగండ్ల  వాన.. జనజీవనాన్ని స్తంభింపజేసింది. శుక్రవారం(ఏప్రిల్-6) సాయంత్రం ఉన్నపాటుగా మొదలైన గాలివాన.. జంటనగరాలను షేక్ చేసింది. కొన్ని ప్రాంతాల్లో 70 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచాయి. నగరం నలుదిక్కులా జడివాన వెల్లువలా కురిసింది.

భారీ వర్షంతో వెంగళరావు నగర్ తో పాటు.. మరిన్ని ప్రాంతాల్లో చెట్లు కూలాయి. ఓ కారు ధ్వంసమైంది.పంజగుట్ట బజాజ్‌ ఎలక్ర్టానిక్స్‌ దగ్గర నిర్మాణంలో ఉన్న సెంట్రింగ్‌ కూలింది. హోర్డింగ్‌లకు ఉన్న ఫ్లెక్సిలు చిరిగి రోడ్లపై పడడంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు.  లోయర్ టాంక్ బండ్ లో నీళ్లు నిలిచాయి. ప్రభుత్వం, అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. విద్యుత్ అంతరాయం కలిగిన ప్రాంతాల్లో 400 మంది ఇంజినీరింగ్ సిబ్బందిని రంగంలోకి దించారు. ముంపు ప్రాంతాల్లో సిబ్బంది జనానికి అందుబాటులో ఉంచేలా.. ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ జామ్ కాకుండా సిబ్బందిని అలర్ట్ చేశారు. కూలిన చెట్లను తొలగించారు.

ఖైరతాబాద్ లో 5.2 సెంటీమీటర్లు.. నాంపల్లిలో 4.2.. సైదాబాద్ లో 3.7.. శ్రీనగర్ కాలనీలో 3.2.. అమీర్ పేటలో 2.7.. పాశమైలారంలో 2.4.. నారాయణగూడలో 2.3.. రాజేంద్రనగర్ లో 1.6.. ఉప్పల్ లో 1.4.. మాదాపూర్ లో 1.3.. బేగంపేటలో ఒక సెంటీమీటర్ వర్షపాతం రికార్డ్ అయ్యింది.

హైదరాబాద్ తో పాటు.. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా వర్షాలు ప్రభావం చూపించాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో పిడుగుపాటుతో అబేద్ హుస్సేన్ అనే వ్యక్తి చనిపోగా.. జనార్దన్ అనే మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. చేవెళ్లలో ఉరుములతో కూడిన వర్షం కురిసింది. సిద్ధిపేటలో ఈదురుగాలులతో వాన పడింది. చాలా ప్రాంతాల్లో పంట దెబ్బ తింది.

Posted in Uncategorized

Latest Updates