వాట్సాప్ లో పోస్టింగ్ పై వివాదం : ఇంటికొచ్చిన సభ్యుడిని కొట్టి చంపిన కుటుంబం

group whattsసోషల్ మీడియాతో ఎంత మంచి జరుగుతుందో..కొందరి వికృతి చేష్టలతో చెడు కూడా తీవ్ర ప్రభావంగా ఉంటుంది. ఇటీవల వాట్సప్ గ్రూప్ లోని నుంచి తనను తొలగించారని గ్రూప్ అడ్మిన్ పై ఓ వ్యక్తి కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఇలా రకరకాల ఇష్యూస్ తో ఎక్కడోచోట సోషల్ మీడియాపై ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. లేటెస్ట్ గా వాట్సాప్ గ్రూప్‌ లో ఫొటో ను పోస్ట్ చేయడం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది.

ఈ ఘటన హర్యానాలోని సోనిపట్‌ లో వెలుగుచూసింది. లవ్ జోహార్ (28)అనే వ్యక్తి జోహార్స్ అనే పేరుమీదున్న వాట్సాప్ గ్రూప్‌ కు అడ్మిన్‌గా ఉన్నాడు. జోహార్స్ వాట్సాప్ గ్రూప్‌ లో స్థానిక ప్రాంతంలోని గోత్రా కమ్యూనిటీ వ్యక్తులు, స్నేహితులు సభ్యులుగా ఉన్నారు. గ్రూప్‌ లో ఉన్న సభ్యులంతా ఏదైనా ఎలక్షన్ ఉంటే ఎవరికి ఓటు వేయాలనే విషయంపై కలిసి నిర్ణయం తీసుకుంటారు. ఆదివారం (జూన్-3) రాత్రి వాట్సాప్ గ్రూప్ సభ్యులంతా డిన్నర్ చేశారు. డిన్నర్ సమయంలో వాట్సాప్ అడ్మిన్‌ గా ఉన్న లవ్ జోహార్ వ్యక్తిగత ఫొటో ఒకటి గ్రూప్‌ లో షేర్ చేశాడు. దీంతో వాట్సాప్ గ్రూప్ మెంబర్ దినేశ్ అలియాస్ బంటీ జోహ్రీ వాట్సాప్ అడ్మిన్ లవ్‌ జోహార్‌ తో వాగ్వాదానికి దిగాడు. తన ఇంటికెళ్లి ఈ గొడవను సరిదిద్దుకుందామని దినేశ్ లవ్ జోహార్‌ కు సూచించారు.

లవ్‌ జోహార్ అతని ముగ్గురు సోదరులు ఈ విషయంపై మాట్లాడటానికి దినేశ్ ఇంటికి వెళ్లారు. అయితే దినేశ్ కుటుంబసభ్యులు ఒక్కసారిగా లవ్‌ జోహార్‌ తోపాటు అతని సోదరులపై రాడ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో లవ్‌జోహార్ ప్రాణాలు కోల్పోయాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కేవలం చిన్న కారణం తీవ్ర ఘర్షణకు దారి తీసి ప్రాణాల మీదకు వచ్చిందని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనకు కారణమైన దినేశ్.. అతని ఐదుగురు కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకుంటామని వెల్లడించారు పోలీసులు.

Posted in Uncategorized

Latest Updates