వాట్ ఏ గ్రేట్ ఐడియా : విరిగిన పట్టాను గుడ్డతో కలిపారు

 వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ముంబైలోని రోడ్లు చెరువులు, నదులను తలపిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో రైల్వే ట్రాక్ లు పూర్తిగా దెబ్బతినడంతో రైళ్ల రాకపోకలు  తీవ్ర అంతరాయం కలిగింది. విరిగిపోయిన రైలు పట్టాలను ఓ గుడ్డతో కలిపే ప్రయత్నం చేశారు రైల్వే ఉద్యోగులు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మంగళవారం(జులై-11) సాయంత్రం 6 గంటల 30నిమిషాల సమయంలో హార్బర్ లైన్ లోని సబర్బన్ గోవండి- మన్ కుర్ద్ స్టేషన్ల మధ్య ఓ రైలు పట్టా విరిగినట్లు గుర్తించారు అధికారులు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన అధికారులు కేవలం అరగంట వ్యవధిలోనే దాన్ని రిపేర్ చేశారు. అయితే రిపేర్ చేస్తున్న సమయంలో తీసిన ఓ వీడియో నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పగిలిపోయిన పట్టాను ఓ వాడేసిన గుడ్డతో కలిపేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. వీడియో వైరల్ కావడంతో రైల్వే అధికారులపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

అసలు వీళ్లకు ఎవరిచ్చారు రా బాబూ ఉద్యోగం అంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. అసలు ప్రజల ప్రాణలంటే వీళ్లకు పిల్లాటలుగా ఉందంటూ విమర్శలు వెల్లువెత్తడంతో.. రైలు అధికారులు ఈ ఘటనపై వివరణ ఇచ్చారు.  కేవలం ఫ్ర్యాక్చర్ అయిన ప్రాంతాన్ని గుర్తించేందుకే గుడ్డను వాడామని, పగిలిన పట్టాను అతికించేందుకు గుడ్డను వాడలేదని వివరణ ఇచ్చారు. పెయింట్ కు బదులుగా మాత్రమే గుడ్డను ఉపయోగించినట్లు తెలిపారు. అయితే ఈ ఘటనపై కమీషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ విచారణ జరిపించాలని ప్యాసింజర్ రైట్స్ యాక్టివిస్ట్, ఆర్టీఐ కార్యకర్త సమీర్ జవేరి డిమాండ్ చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates