వారంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్

హైదరాబాద్ : పంచాయతీ ఎన్నికల రెడీ అవుతోంది ప్రభుత్వం. జనవరి 10లోపు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాలతో ఏర్పాట్లు చేస్తోంది. అయితే పంచాయతీ ఎన్నికలకు ఇన్నాళ్లు అడ్డంకిగా భావించిన.. బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు పూర్తయ్యాయి. సీఎం, హోంమంత్రులు బాధ్యతలు స్వీకరించినా.. పూర్తిస్ధాయి మంత్రి వర్గం ఏర్పాటుకాలేదు. కానీ పంచాయతీ ఎన్నికలను మాత్రం వచ్చే జనవరి 10లోపు నిర్వహించాల్సిందేనని హైకోర్టు ఆదేశాలు ఇవ్వటంతో.. కాస్త హడావుడి నెలకొంది.

బీసీ రిజర్వేషన్ల హామీపై ఎన్నికల సమయంలో ఆయా వర్గాలు నిలదీసే అవకాశం ఉంది. రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం మాత్రమే జనగణన ఉంది. కానీ బీసీ కమిషన్ నుంచి అధికారికంగా జనగణన చేయలేదు. ఇప్పటికపుడు ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల కోసం ప్రత్యేక ఆర్డినెన్స్ తేవాలని అనుకున్నా.. మళ్లీ కోర్టు కొట్టివేసే చాన్సుంది. కాబట్టి మరికొంత సమయం ఇస్తే బీసీ గణన చేస్తామని ప్రభుత్వం కోర్టును ఒప్పించగలిగితే.. రిజర్వేషన్లపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

తెలంగాణలో 90 శాతానికి పైగా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉన్నారని చాలా సందర్భాలలో సీఎం కేసిఆర్ చెబుతూవచ్చారు. వారిలో 50 శాతానికి పైగా బలహీనవర్గాల వారు ఉన్నారన్నారు. అలాంటపుడు వారికి రిజర్వేషన్లు పెంచకపోతే ఎలా అని ఆయనే ప్రశ్నించారు. తమిళనాడు తరహాలో తెలంగాణకు కూడా కోటా పెంపునకు అనుమతివ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కానీ ప్రభుత్వం బీసీ జనగణన చేయకుండా.. జనాభాకు శాస్త్రీయమైన లెక్కలు లేకుండా.. తీసుకునే నిర్ణయాలు నిలబడవని రాజ్యాంగ విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో కర్ణాటక ప్రభుత్వం వర్సెస్ కృష్ణమూర్తి తీర్పులో ఇదే విషయం స్పష్టమైందని అంటున్నారు.

2012లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించారు. దీనిపై  అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయితే అప్పటికే నోటిఫికేషన్ ఇవ్వటం, ఎన్నికల ఏర్పాట్లు పూర్తి కావటంతో చేసేది లేక.. ఒక్కసారికి అనుమతిస్తున్నట్లు అప్పట్లో కోర్టు చెప్పింది. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు సమీపించటంతో.. బీసీల రిజర్వేషన్ల అంశం తెరపైకి వచ్చింది. రిజర్వేషన్లను 60.19 శాతం కొనసాగించేందుకు పునఃపరిశీలించాల్సిందిగా సర్కార్ హైకోర్టులో పిటిషన్  దాఖలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు చెప్పినట్లు 50 శాతానికే పరిమితమైతే.. ఎస్సీలకు 20.46 శాతం, ఎస్టీలకు 5.73 శాతం, బీసీలకు 23.81 శాతం రిజర్వేషన్లు లభిస్తాయి. అంటే బీసీలకు రాష్ట్ర పంచాయతీరాజ్  చట్టంలో పొందుపరిచిన 34 శాతంలో.. ఇప్పుడు 10.19 శాతం నష్టపోతారు. దీంతో రిజర్వేషన్లపై క్లారిటీ కోసం ఎదురుచూసిన ప్రభుత్వానికి.. కోర్టుల నుంచి ప్రతికూల నిర్ణయాలు వెలువడ్డాయి. 50 శాతం రిజర్వేషన్లు దాటొద్దని  పెర్కొనటంతో.. ప్రభుత్వం అవసరమైతే ప్రత్యేక ఆర్డినెన్స్ తేవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఆర్డినెన్స్ పై సంబంధిత అధికారులతో.. సీఎం రెండు రోజులుగా సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే జనవరి 10లోపు ఎన్నికల నిర్వహణ సాధ్యంకాదని  నిర్ధారించుకున్న ప్రభుత్వం.. కోర్టును మరింత సమయం కోరనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం మధ్యంతర ఉత్తర్వులిచ్చిన హైకోర్టుకే వెళ్లాలనే ఆలోచనలో సర్కార్లు ఉన్నట్లు తెలుస్తోంది. రిజర్వేషన్ల పెంపుకోసం ఓవైపు న్యాయ పోరాటం చేస్తునే.. ఎన్నికల నిర్వహణకు రెడీ అవుతోంది సర్కార్. ఎన్నికలను జనవరి 10లోపు నిర్వహించాలన్న కోర్టు తీర్పుకు అనుగుణంగా.. బ్యాలెట్ పేపర్లతో పాటు అవసరమైన ఏర్పాట్లు చేస్తుంది ఎన్నికల సంఘం. ఏదేమైనా పంచాయతీ ఎన్నికలు జనవరి 10లోపే ఉంటాయా లేదా అనే విషయంపై మూడు నాలుగు రోజుల్లో క్లారిటీ రానుంది.

Posted in Uncategorized

Latest Updates