వాహనదారులు జాగ్రత్త : చిన్న పొరపాటుకు కూడా భారీ పెనాల్టీ

వాహనదారులు జర జాగ్రత్త…ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే వందో…రెండొందలో…మహా అయితే ఐదొందలు అనుకుంటున్నారా…లేదు భరించలేని భారీ జరిమానా విధించబోతున్నారు. సీటు బెల్టు పెట్టుకోకుండా వాహనాన్ని నడిపితే రూ. వందే కదా ఫైన్‌ కట్టేసి పోదామనుకుంటున్నారా? …లేదు… ఇక నుంచి ఇలాంటి తప్పిదాలకు వెయ్యి కట్టాల్సిందే. తాగిన మైకంలో డ్రైవింగ్‌ చేసి రూ. 2 వేలు చెల్లిస్తే సరిపోతుందిలే అనుకోకండి… దానికి రూ. 10 వేలు సమర్పించాలి. ఇష్టమొచ్చినట్లు బండి నడిపితే ఎవరు చూస్తారులే అని గప్‌చుప్‌గా ఉందామనుకుంటే ట్రాఫిక్‌ పోలీస్‌ రూ. వెయ్యికి బదులు ఐదు వేలు కట్టించుకుంటాడు. లైసెన్సే లేకుండా భేషుగ్గా వాహనం నడిపితే రూ. 5,000 జరిమానా కట్టాలి… ఫోన్లో మాట్లాడుతూ బండి నడిపితే రూ. 5,000 కట్టితీరాల్సిందే. దీనికి సంబంధించిన బిల్లు లోక్‌సభలో ఆమోదం పొంది రాజ్యసభ ఆమోదం కోసం వెళ్ళింది. మోటారు వాహనాల సవరణ బిల్లు 2017 పాస్‌ అయితే పైవన్నీ అమల్లోకి వస్తాయి.

బిల్లులోని ముఖ్యాంశాలు ఇవే…

* వాహనం నిర్ణీత ప్రమాణాల మేరకు లేకపోతే ప్రభుత్వం వాటిని వెనక్కు తెప్పించవచ్చు. కంపెనీలకు సైతం రూ. 500 కోట్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.

*దివ్యాంగులకు అవసరమైన రీతిలో వాహనాల నిర్మాణాన్ని తప్పనిసరి చేశారు.

*  కాలంచెల్లిన డ్రైవింగ్‌ లైసెన్స్‌ను తిరిగి పునరుద్ధరించుకోవడానికి గతంలో ఉన్న నెల గడువును ఏడాదికి పెంచారు.

*  ప్రమాదాల్లో మరణాలకు థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ పరిమితిని రూ. 10 లక్షలు, తీవ్రమైన గాయాలకు గురయ్యే వారికి రూ. 5 లక్షల చొప్పున చెల్లించాలని 2016 చట్టం పేర్కొంది. ఇకపై ఆ పరిమితి ఉండదు. రోడ్డు ప్రమాదాల్లో 6 నెలల్లోపే బాధితులు నష్టపరిహారం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మోటారు వాహనాల యాక్సిడెంట్‌ ఫండ్‌లో ఇకపై ఇన్సూరెన్స్‌ను కూడా చేర్చారు.

*ప్రమాదాలకు మైనర్లు కారణమైన సందర్భంలో వాహన యజమాని లేదా మైనరు సంరక్షకులుగానీ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఒకవేళ సంరక్షకులు, వాహన యజమానులకు ఈ ప్రమా దం తెలియకుండా జరిగినట్టు లేదా తాము నివారించే ప్రయత్నం చేశామని నిరూపించుకుంటే తప్ప వారే మైనర్ల ప్రమాదాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అది వారికి తెలిసి జరిగినట్టయి తే మోటారు వాహన రిజిస్ట్రేషన్‌ రద్దు అవుతుంది.

*జువైనల్‌ చట్టం ప్రకారం నేరస్తులను విచారిస్తారు. ప్రమాదంలో ఉన్న వారిని ఆదుకునే వారికి ఈ బిల్లు రక్షణ కల్పిస్తోంది. ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు తోడ్పడిన వారిని నేరంలో భాగం చేయకుండా ఇది నివారిస్తుంది. బాధితులను ఆసుపత్రిలో చేర్చినప్పుడు సైతం వారు కోరితే వారి వివరాలను పోలీసులు, ఆసుపత్రి వర్గాలు గోప్యంగా ఉంచాల్సి ఉంటుంది.

 

Posted in Uncategorized

Latest Updates