వింబుల్డన్ సింగిల్స్ ఫైనల్స్‌ : జకోవిచ్ విజేత

వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్స్‌ లో సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్(31) అదరగొట్టేశాడు. తన మునుపటి ఫామ్, ఆటతీరును ప్రదర్శించిన జకోవిచ్ అంచనాలకు తగ్గట్టుగా రాణించి అభిమానుల కల నెరవేర్చాడు. కెరీర్‌లో నాలుగో వింబుల్డన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. మొత్తంగా అతనికి 13వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం.

2011, 2014, 2015లలో జకోవిచ్ వింబుల్డన్ ఛాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం  (జూలై-15)రాత్రి జరిగిన తుదిపోరులో జకోవిచ్ 6-2, 6-2, 7-6(3) తేడాతో సౌతాఫ్రికా స్టార్, ఎనిమిదో సీడ్ కెవిన్ అండర్సన్‌ పై విజయం సాధించాడు. తొలి రెండు సెట్లను జకోవిచ్ అలవోకగా గెలుచుకున్నాడు. అయితే మూడో సెట్‌ లో ప్రత్యర్థి నుంచి అనూహ్య ప్రతిఘటన ఎదురైంది. మూడో సెట్‌ లో జకోవిచ్-ఆండర్సన్ మధ్య పోరు హోరాహోరీగా సాగింది. టైబ్రేక్‌ కు దారి తీయడంతో ఆ సెట్‌ లో నూ జకోవిచ్ 6-3తేడాతో గెలిచి టైటిల్‌ ను ముద్దాడాడు. ఈ టోర్నీలో అండర్సన్‌ కు ఇదే తొలి వింబుల్డన్ ఫైనల్ కావడం విశేషం.

Posted in Uncategorized

Latest Updates