విద్యార్థినుల హెల్త్ కిట్స్ కోసం.. ఏటా రూ.వంద కోట్లు : కడియం

విద్యార్థినిల ఆరోగ్య రక్షణలో భాగంగా ఏటా వంద కోట్ల రూపాయల విలువైన హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ ను 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే 6 లక్షల మంది విద్యార్థినులకు ఇస్తున్నామన్నారు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి. సోమవారం (జూలై-30) వరంగల్ అర్భన్ జిల్లా, భీమదేవరపల్లి మండలం, వంగర గ్రామంలోని తెలంగాణ రాష్ట్ర సాధారణ గురుకుల అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు కడియం శ్రీహరి. ఇందులో విద్యార్థినిలకు కావల్సిన సబ్బులు, రిబ్బన్లు, బొట్టు బిల్లలు, పౌడర్లు, బ్రష్ లు, టూత్ పేస్టులు, నూనె, రబ్బర్ బ్యాండ్లు, సానిటరీ న్యాప్కిన్స్ ఇస్తున్నామని చెప్పారు. దేశంలో ఎక్కడా కూడా తెలంగాణలో ఉన్నన్ని గురుకులాలు ఏ రాష్ట్రంలో లేవని, అదేవిధంగా హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ కూడా ఈ తరహాలో ఎక్కడా ఇవ్వడం లేదన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ఉచిత విద్య దాదాపుగా అందరికీ అందుబాటులో ఉందని, అయితే నాణ్యమైన విద్య అందించాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ గురుకులాలను పటిష్టం చేసే బాధ్యతను అప్పగించారని కడియం శ్రీహరి తెలిపారు. తెలంగాణలో చదివిన విద్యార్థి ప్రపంచంలో ఎవరితోనైనా పోటీ పడేవిధంగా తయారు చేయడమే లక్ష్యంగా ఈ నాణ్యమైన విద్య ఉండాలన్నది సీఎం కేసీఆర్ ఆశయమన్నారు. ఇందులో భాగంగానే గత 60 ఏళ్లలో 276 గురుకులాలు ఏర్పాటైతే ఈ నాలుగేళ్లలో 570 గురుకులాలను ఏర్పాటు చేశారన్నారు. వీటితో పాటు 85 కేజీబీవీలు కూడా ఏర్పాటు అయ్యాయన్నారు. డిగ్రీ చదివే ఎస్సీ, ఎస్టీ మహిళల కోసం 53 రెసిడెన్షియల్ డిగ్రీకాలేజీలు ఏర్పాటు చేశామన్నారు.

రాష్ట్రంలోని పేదవర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యనందించడమే కాకుండా పౌష్టికాహారం కూడా అందిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. నెలకు ఆరుసార్లు మాంసాహారం, వారానికి ఐదు రోజులు గుడ్లు, ప్రతి రోజు బూస్ట్ మిల్క్, అల్పాహారం, మధ్యాహ్నం 50 గ్రాముల నెయ్యితో భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి మంచి భోజనం పౌష్టిక విలువలతో కూడినది అందిస్తున్నట్లు వివరించారు.

Posted in Uncategorized

Latest Updates