విభజన హామీల కోసం.. కేంద్రమంత్రులతో ఎంపీల భేటీ

విభజన చట్టంలో ఇచ్చిన హామీల సాధన కోసం టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో పోరాడాలని నిర్ణయించారు. పార్లమెంట్ వేదికగా విభజన అంశాలపై చర్చకు పట్టుపట్టనున్నారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలే హైదరాబాద్ పార్టీ ఎంపీలతో సమావేశమై పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. ఇవాళ పార్లమెంట్ కు హాజరైన టీఆర్ఎస్ ఎంపీలు.. తమ కార్యాచరణ ప్రారంభించారు. కేంద్రమంత్రులతో సమావేశమై తెలంగాణ హక్కులకోసం ఒత్తిడి పెంచనున్నారు.

తమ కార్యాచరణను మీడియాకు వివరించారు ఎంపీలు. ఎయిమ్స్ తో సహా అన్ని విషయాలపైనా కేంద్రాన్ని నిలదీస్తామన్నారు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత జితేందర్ రెడ్డి. ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం కోసం బైసన్ పోలో గ్రౌండ్ వెంటనే కేటాయించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తామన్నారు. పెండింగ్ అంశాలపై ఇప్పటికే 33 సార్లు కేంద్రానికి కేసీఆర్ స్వయంగా వెళ్లి పత్రాలు ఇచ్చినా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. 52 అంశాలను జాతీయ స్థాయిలో ప్రస్తావిస్తామన్నారు.  రిజర్వేషన్ల పెంపుపై పార్లమెంట్ లో గట్టిగా పట్టుబడుతామన్నారు. వ్యవసాయ రంగానికి నరేగా చట్టాన్ని అనుసంధానం చేయాలని పార్లమెంట్ లో కోరుతామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాపై కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. జనవరి ఒకటి నాటికి తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుచేయించే లక్ష్యంతో పార్లమెంట్ లో పోరాడుతామన్నారు. తెలంగాణ ప్రజల ఆగ్రహానికి  బీజేపీ 103 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయిన విషయాన్ని బీజేపీ నేతలు గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్ర పథకాలకు నిధులు, ITIR ఏర్పాటు, రిజర్వేషన్ల పెంపు, బయ్యారం స్టీల్ ప్లాంటు మరిన్ని అంశాలను పార్లమెంటులో ప్రస్తావించనున్నారు టీఆర్ఎస్ ఎంపీలు.

కేంద్రమంత్రులతో ఎంపీల భేటీ

పార్లమెంటులో కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ను ఆయన ఆఫీస్ లో కలిశారు టీఆర్ఎస్ ఎంపీలు. సాయంత్రం కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ తో టీఆర్ఎస్ ఎంపీలు భేటీ కానున్నారు. రేపు న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ లను కలవనున్నారు టీఆర్ఎస్ ఎంపీలు. అంశాల వారీగా మంత్రులతో భేటీ కావాలని నిర్ణయించారు.

Posted in Uncategorized

Latest Updates