విషాదం: కలుషిత ప్రసాదం తిని 10 మంది మృతి

కర్ణాటకలోని చామరాజనగర్ లో విషాదం చోటుచేసుకుంది. కలుషిత ప్రసాదం తిని 10 మంది మృతి చెందగా సుమారు 80 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిని వెంటనే దగ్గర్లోని హాస్పటల్ కు తరలించారు. అస్వస్థతకు గురైన వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉందని అక్కడి అధికారులు తెలిపారు. చామరాజనగర్‌లోని కిచ్చుకట్టి మారెమ్మ ఆలయంలో ఇవాళ(శుక్రవారం) గోపురం శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వందలాది మంది భక్తులు హాజరయ్యారు. శంకుస్థాపన, పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఆలయంలో తయారుచేసిన ప్రసాదాన్ని భక్తులందరికీ పంపిణీ చేశారు.

ప్రసాదం తిన్న భక్తులు తీవ్ర అస్వస్థతకు గురై వాంతులు చేసుకున్నారు. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారని.. చనిపోయిన వారిలో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు చామరాజనగర్ ఎస్పీ ధర్మేంద్ర కుమార్‌ మీనా తెలిపారు. ప్రసాదం శాంపిల్స్‌ను సేకరించిన అధికారులు వాటిని పరీక్షించేందుకు ల్యాబ్‌కు పంపించారు.ప్రసాదంలో విషం కలిసి వుంటుందనే అనుమానాలను జిల్లా ఆరోగ్యశాఖ అధికారి వ్యక్తం చేశారు. బాధితులకు వెంటిలేటర్‌ మీద శ్వాస అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఈ ఘటన పై కర్ణాటక సీఎం కుమారస్వామి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.చనిపోయినవారికి 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.బాధితులకు మెరుగైన వైద్య సాయం అందించాల్సిందిగా వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆయన ఆదేశించారు.

Posted in Uncategorized

Latest Updates