వి మిస్ యూ : ఆణిముత్యం మా రాధిక

Anchor-Radhikaతెలంగాణ ఆణిముత్యం మా రాధిక. కడిగిన ముత్యంలా ఉంటుంది. వార్త చదివేటప్పుడు మెరిసే పగడం అనిపిస్తుంది. రాజకీయాలైనా.. సామాజిక సమస్యలైనా.. సినిమాలైనా.. తెలంగాణకు ఆత్మలాంటి కళలైనా.. అన్నింటిపైనా గలగలా మాట్లాడుతుంది. డిబేట్ లు ఉన్నాయంటే ముందుంటుంది. కొత్త విషయాలు తెల్సుకోవడానికి ఎప్పుడూ తపన చూపించేది రాధిక. ఎప్పటికప్పుడు తనను తాను అప్ డేట్ చేసుకునేది. నిండుకుండలాంటి మనసున్న మా రాధిక.. స్క్రీన్ కే నిండుదనం తీసుకొచ్చేది.

సరదాగా మాట్లాడే చిన్నపిల్ల. మాటకు మాటిచ్చి.. సెటైర్లు వేసే పెంకిపిల్ల. సామాజిక అంశాలు ప్రస్తావిస్తే సంఘసంస్కర్త. కుటుంబ విలువల గురించి మాట్లాడితే ఇంటికే పెద్దబిడ్డ. తనలోని విభిన్న మనస్తత్వాలను ఆవిష్కరించిన అరుదైన యాంకర్ కమ్ రోల్ మోడల్ రాధిక. మనసును బాధలు సూదిలా పొడుస్తున్నా.. ఎదుటోడికి అది తెలిసేదే కాదు. గుండెలోతులో గాయాలున్నా.. బయటకు మాత్రం చిరునవ్వు నవ్వేది.

రాధిక అంటే గ్లామర్. రాధిక అంటే హ్యూమర్. రాధిక అంటే ప్రొఫెషనలిజం.. రాధిక అంటే ఫెమినిజం. టీవీ ఛానెలంటేనే బ్రేకింగ్స్… బిగ్ న్యూస్. ఆ క్షణంలో వచ్చిన వార్తకు అప్పుడే సిద్ధం కావాలి. ప్రళయం లాంటి వార్త వచ్చినా.. ఏ సందర్భంలోనూ ఏనాడూ తొణకలేదు మా రాధిక.

గోదావరి నది అంత గాంభీర్యం, హుందాతనం మా రాధిక సొంతం. గోదావరి కథలు ప్రోగ్రామ్ అంతగా జనంలోకి వెళ్లిందంటే దానికి రాధిక ప్రతిభే కారణం. తెలంగాణ ఆణిముత్యాల్లాంటి ఎందరో ప్రముఖుల్ని జనాలకు పరిచయం చేసింది. సినారె, చుక్కసత్తయ్య, గూడ అంజయ్య, మల్లు స్వరాజ్యం, జయరాజ్.. ప్రముఖులందరిదీ ఒక్కొక్కరిది ఒక్కో మాట.. ఒక్కో యాస. కానీ.. మా రాధిక.. వారితో మాట్లాడేటపప్పుడు వారి భాషలోనే పలకరించేది. ప్రశ్నలు అడిగే పద్ధతిలోనూ ప్రత్యేకత చూపించేది. మాటకు మాటిచ్చే తెలంగాణ గడుసు పిల్ల మా రాధిక.

వీ6 ప్రయోగాలకు అడ్డా. ఆ ప్రయోగశాల చేతికి దొరికిన పాదరసం రాధిక. యాంకర్ గా.. ప్రొడ్యూసర్ గా… ఏ బాధ్యత అప్పజెప్పినా వందశాతం న్యాయం చేసేది. వృత్తిగతంగా అంతటి ప్రతిభావంతురాలు కాబట్టే.. తెలంగాణ మాట్లాడినా.. తెలుగు మాట్లాడినా.. ఆమెకు అది బఠాణీలు తిన్నంత ఈజీ.

2014లో మా ఛానెల్లో అడుగు పెట్టావ్. అప్పటి నుంచి నువ్వేంటో మాకు తెలుసు. నువ్వెవరో జనాలకు ఇంకా తెలుసు. పేరు తెలియకపోయినా.. నీ మాటకు.. నీ బులెటిన్ కు ఫ్యాన్స్ ఎందరో. ఎన్నడూ ఒప్పుకోలేదు కానీ… మా రాధిక ఒక ఇన్విన్సిబుల్ హీరోయిన్.

మీకు తెలిసి ఉండకపోవచ్చు..  కాలు ఫ్రాక్చర్ అయినా.. ఆ నొప్పిని ఓర్చుకుని వార్తలు చదివింది. జ్వరమొచ్చినా ఆఫీసుకు వచ్చేది. కానీ.. మనసుకు తగులుతున్న గాయాలను ఎంతోకాలం ఓర్చుకోలేకపోయింది. మానసికంగా ధృఢమైన నువ్వు ఇలా బేలగా నిర్ణయం తీసుకుంటావని కలలో కూడా ఊహించలేదు. పైడిజయరాజ్ డాక్యుమెంటరీ  కోసం.. దేశం మొత్తం చుట్టేసివచ్చింది రాధిక. స్వతంత్ర భావాలున్న మహిళగా గుర్తింపుతెచ్చుకున్నావ్. మరి మృత్యు శిఖరంపైకి విధి నడిపిస్తున్నప్పుడు నీ ధైర్యం ఏమైంది… చావాలన్న పిరికి ఆలోచన చేసేంత ధైర్యం ఎవరిచ్చారు.. మాకైతే అర్థం కావడం లేదు.

మాకు తెలిసిన రాధిక ఓ పెన్నుల దొంగ. కొత్త పెన్ను ఎక్కడ పెట్టినా మాయమయ్యేది. ఇప్పుడే ఇస్తా అని చెప్పిందంటే అదిక రాదన్నట్టే లెక్క. అందుకే.. రాధిక వస్తే పెన్నులు దాచిపెట్టుకోవాలనుకునేవాళ్లం. తలో పెన్ను ఇస్తాం..ఒక్కసారి వచ్చి తీసుకుపో రాధిక.

అందుకే నీవు చెప్పిన కథలు విన్న గోదావరి ఇపుడు చిన్నబోయింది. నువ్వు కనపడనిదే.. బోనాలు, సమ్మక్క సారలమ్మ జాతర విశేషాలు, తెలంగాణ తీర్థం ముచ్చట్లు, పండుగ లైవ్ షోలు పూర్తికావు. నాలుగేండ్లు వీ6 బతుకమ్మను ఎత్తుకున్నావ్. మా బతుకమ్మ పాటల్లో ఇక నువ్వు కనిపించవంటే మాకే బాధేస్తోంది. మనసులో అగ్నిపర్వతం అంత బాధ వున్నా ఎప్పుడూ నవ్వుతూ కనిపించి మోసం చేసి వెళ్లిపోయావా? నీ బాధను తెలుసులేకపోయామన్న గిల్టీ ఫీలింగ్ తో అందరినీ నేరస్తులను చేసి పోయావు.

వ్యక్తిగత సమస్యల వలయం నుంచి బయటపడలేకపోవచ్చు. వైవాహిక జీవితం సుడిగుండంలోకి తోసిఉండొచ్చు. కొడుకు మానసిక సమస్య ఆమెకు మానసిక వ్యథ పెంచి ఉండొచ్చు. కానీ.. మా ఆఫీస్ దృష్టిలో మాత్రం ఆమె ఓ డేరింగ్ లేడీ. గట్స్ ఉన్న న్యూస్ రీడర్. డాషింగ్ రిపోర్టర్.  వ్యక్తిగతాన్ని వృత్తితో ముడిపెట్టని అరుదైన గ్రేట్ ఎంప్లాయ్.

Posted in Uncategorized

Latest Updates