వి మిస్ యూ రాధిక

Anchor-Radhika-Reddy-Commits-Suicideవిధి బలీయమైంది. విధి ఆడే వింత నాటకంలో అంతా పావులే. మనిషి జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదంటారు. న్యూస్ ప్రజెంటర్ రాధిక జీవితమే ఓ ఉదాహరణ. నిన్నా మొన్నటి వరకు అందరితో నవ్వుతూ సరదాగా గడిపిన ఆమె ఆత్మహత్య అందరినీ కలిచివేసింది. కొండంత బాధను మనసులోనే దాచుకుని.. మొహంపై చిరునవ్వు చెరగనివ్వని ఆమె లేరన్న వార్త అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. తన జీవితపు ఆఖరి బులెటిన్ కు సెలవంటూ వెళ్లిపోయారు రాధిక.

ఈ చిరునవ్వులు ఇప్పుడు మాయమయ్యాయి. వార్తను వార్తలా కాకుండా..  జనం ఆర్థను, ఆర్థత, ఆవేదనను కళ్లకు కట్టినట్టు చూపించిన సీనియర్ న్యూస్ ప్రజెంటర్ రాధిక ఇక సెలవంటూ వెళ్లిపోయారు. మనిషి జీవన విధానాలను… వారి సంస్కృతి సంప్రదాయాల్లో పండుగలను..  తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాల విశిష్టతను చాటిచెప్పిన రాధిక.. అర్థాంతరంగా తనువు చాలించారు.

వీ6 లో ప్రసారమయ్యే న్యూస్ తో పాటు చాలా ప్రోగ్రామ్స్ కు జీవం పోశారు ఆమె. రాష్ట్రంలోని ఆలయాల విశిష్టతను.. చరిత్రను సామాన్యుడికి అర్థమయ్యేలా సవివరంగా చెప్పడంలో ఆమెకు ఆమే సాటి. ఇవే కాకుండా ప్రత్యేక కార్యక్రమాల్లో ఆమె ప్రజెంటేషన్ అద్భుతమనే చెప్పాలి. మహిళా దినోత్సవం… మదర్స్ డే.. మహిళా సాధికారిత వంటి ప్రత్యేక కార్యక్రమాల న్యూస్ లో ఆమె ఉండి తీరాల్సిందే అంటే.. ఆమె ప్రతిభ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

తెలంగాణ పల్లె జనంతో పాటు.. దేశ విదేశాల్లోని తెలుగు ప్రజలకు వారి మనస్సులకు చేరువైన V6 న్యూస్ బోనాల పాట షూట్ లో కీ రోల్ పోషించారు రాధిక. అందరినీ కో ఆర్డినేట్ చేసుకుంటూ పాట చిత్రీకరణను విజయవంతంగా పూర్తి చేశారు. ఇందులో ఆమె పడిన శ్రమ.. ఆ పాట సక్సెస్ లో స్పష్టంగా కనిపిస్తుంది. బతుకమ్మ వేడుకలు, సిటీలో వినాయకచవితి సందడి, గణేష్ నిమజ్జనం.. ఇలా అన్నింట్లోనూ రాధిక ఉండి తీరాల్సిందే. స్టూడియోలో కూర్చొని న్యూస్ ప్రజెంట్ చేయడమే కాదు.. ఫీల్డ్ లోనూ ఆమె రిపోర్టింగ్ చేసేవారు. తెలంగాణ పల్లెలకు వెళ్లి.. బతుకమ్మ విశిష్టతను ప్రపంచానికి చెప్పడంలో ఆమెది ఓ ప్రత్యేకత.  12 ఏళ్లకోసారి జరిగే గోదావరి పుష్కరాల విశిష్టతను, దాని వెనుకున్న కథలను సామాన్య జనానికి అర్థమయ్యేలా వివరించారు రాధిక. ఇందుకోసం ఆమె పడిన శ్రమ అంతా ఇంతా కాదు. మహారాష్ట్రలో గోదావరి నది జన్మస్థానం నుంచి అది ప్రవహించే ప్రాంతాలు.. తిరిగి సముద్రంలో కలిసే చోటు వరకు అనేక విశేషాలను గోదావరి కథలు పేరుతో వరుస కథనాలను ప్రజెంట్ చేశారు రాధిక.

వార్తల్లోని బాధను, భావాలను పలికించడంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన, సుస్థిరమైన చోటును సంపాదించుకున్నారు రాధిక. ఇలా అర్థాంతరంగా మన మధ్యనుంచి వెళ్లిపోయిన ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటోంది వీ6 యాజమాన్యం, సిబ్బంది.

Posted in Uncategorized

Latest Updates