వీకెండ్ ఎఫెక్ట్ : భక్తులతో కిక్కిరిసిన ప్రధాన ఆలయాలు

yadadri
రాష్ట్రంలో ప్రధాన ఆలయాలన్నీ భక్తులతో రద్దీగా మారాయి. యాదాద్రి లక్ష్మీ నరసింహ ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు భక్తులు. వేసవి సెలవులు ముగుస్తుండడం… వీకెండ్ కావడంతో స్వామివారి దర్శనానికి బారులు తీరారు. క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. దీంతో ధర్మ దర్శనానికి 7 గంటలు, ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పట్టింది. యాదాద్రి, బాసర, కొమురవెల్లి , రాజన్న ఆలయాలు రద్దీగా మారాయి.
పంచమి ఆదివారం కావడంతో రాష్ట్రం నుంచే కాకుండా, ఏపీ, మహారాష్ట్ర నుంచి బాసర పుణ్యక్షేత్రానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. చాలా మంది తమ పిల్లలను తీసుకొచ్చి అక్షరాభ్యాసం చేయించారు. గోదావరి నదిలో… పుణ్యస్నానాలు చేసి … అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
మెదక్ జిల్లా ఏడుపాయలలోనూ భక్తుల రద్దీ కనిపించింది. వన దుర్గాభవాని మాత దర్శనం కొరకు ఉదయం నుంచి భక్తులు బారులు తీరారు. అమ్మవారికి వడిబియ్యం, బోనాలు మొక్కుగా చెల్లించారు. ఆలయంలో సౌకర్యాలు మరింత మెరుగుపర్చాలని భక్తులు కోరుతున్నారు.
సిద్ధిపేట జిల్లా కొమురవెళ్లిలో మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారి ప్రత్యేక దర్శనానికి గంట, సర్వ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది.

Posted in Uncategorized

Latest Updates