వీడిని కూంబీపాకం చేసినా తప్పులేదు : భార్య, పిల్లలను రూ.5లక్షలకు అమ్మేశాడు

familyఏపీ రాష్ట్రం కర్నూలు జిల్లా కోయిలకుంట్ల గ్రామం. దేశవ్యాప్తంగా ఈ గ్రామం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ఎందుకో తెలుసా.. ఇక్కడ కలియుగ ధర్మరాజు ఉన్నాడు. అవును వీడికి పేకాట, మందు అంటే చాలా ఇష్టం. ఎంతలా అంటే.. భార్య, పిల్లలను విడతల వారీగా అమ్మేశాడు. ఇతగాడి వ్యవహారం ఇప్పుడు బుర్రలు బద్దలు కొడుతోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఏపీలోని కర్నూలు జిల్లా కోవెలకుంట్లకి చెందిన పసుపులేటి మద్దిలేటి (38)కి నంద్యాలకి చెందిన వెంకటమ్మ (35)తో 15 ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి నలుగురు ఆడ పిల్లలు. మద్దిలేటికి కొంచెం పొలం ఉంది. అయినా వ్యవసాయం చేయడు. కనీసం పనికి కూడా వెళ్లడు. రోజూ లేవగానే మందు కొట్టి పేకాటకు వెళతాడు. ఇదే దినచర్య. భర్త వ్యవహారంతో విసిగిపోయిన వెంకటమ్మ పనులు చేసుకుంటూ పిల్లలను పోషిస్తోంది. టైంకి ఇంటికొచ్చి తిని, పడుకునే మద్దిలేటిగారు.. మందు, పేకాల కోసం అప్పులు చేశాడు. రూ.15 లక్షలు అయ్యింది. అప్పులోళ్ల గొడవలు. రోజూ ఇదే తంతు. అప్పులు తీర్చటానికి బంధువులకే భార్య, పిల్లలను అమ్మేశాడు. అందుకు స్టాంప్ పేపర్లపై గట్టిగానే సంతకాలు చేశాడు. భార్యతో బలవంతంగా కూడా సంతకం పెట్టించాడు. కొనుక్కున్న వారు వీరితో పనులు చేయించుకుంటారు. అంత తిండి పెట్టి గొడ్డు చాకిరీ చేయించుకుంటారు.

రెండేళ్ల క్రితం భార్య నాలుగో కాన్పు కోసం పుట్టింటికి వెళ్లింది. ఆ సమయంలో రెండో పాప (13)ను లక్షన్నర రూపాయలకు అమ్మేశాడు. కొనుకున్నది దూరపు బంధువు. అలా వచ్చిన లక్షన్నర రూపాయలతోనూ తాగి, పేకాట ఆడాడు. ఇప్పుడు మళ్లీ అప్పులు పెరిగిపోయాయి. దీంతో భార్య, పిల్లల మొత్తాన్ని అమ్మకానికి పెట్టేశాడు. రూ.5లక్షలకు డీల్. కొనుక్కుంటున్నది ఎవరో తెలుసా.. మద్దిలేటి గారి అన్నగారే. వారి ఇంట్లో వీరికి అంత బువ్వ దొరుకుతుంది. రోజూ పనులకు పంపించి.. వచ్చిన డబ్బును అప్పు కింద జమ వేసుకుంటారు. 5G టెక్నాలజీ కాలంలో.. మహాభారతం చేష్టలు ఏంటో అర్థం కాక అందరూ అవాక్కు అవుతున్నారు. భర్త వ్యవహారం తెలిసి భయపడిన భార్య వెంకటమ్మ.. పిల్లలను తీసుకుని నంద్యాలలోని పుట్టింటికి వెళ్లిపోయింది. అయినా వద్దల్లేదు ఈ వెధవ. అక్కడికీ వచ్చి వేధించటం మొదలుపెట్టాడు.

నంద్యాలలో పుట్టింట్లో ఉన్న వెంకటమ్మ బాధ తెలుసుకున్న చుట్టుపక్కల వారు ఆమె సలహా ఇచ్చారు. ICDS, పోలీసులను ఆశ్రయించాలని కోరారు. దీంతో ఆమె కంప్లయింట్ చేసింది. ఈ విధంగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆమె బాధలు విన్న ICDS అధికారులు.. పిల్లలను ఆళ్లగడ్డలోని బాలికల పాఠశాలలో చేర్పిస్తామని హామీ ఇచ్చారు. అందుకు చర్యలు మొదలుపెట్టారు. నంద్యాల ఎస్సై రమేష్ కూడా స్పందించారు. కంప్లయింట్ అందిందని.. ఇప్పటికే ఓసారి కౌన్సెలింగ్ కూడా ఇచ్చామని చెబుతున్నారు. మద్దిలేటిని, అతని అన్నయ్యను పిలిపించి సమస్యను పరిష్కరిస్తామని చెబుతున్నారు. మొత్తానికి కలియుగంలోనూ భార్యను అమ్మే ధర్మరాజు ఉండటంలో ఆశ్చర్యం లేదుకానీ.. కొనుక్కోవటానికి రెడీగా ఉన్న వారూ ఉండటం విడ్డూరమే.. ఇలాంటి ఘోరాలు తెలిసినప్పుడు.. ఇంకా మనం ఎక్కడ ఉన్నాం అనిపిస్తోంది కదా…

Posted in Uncategorized

Latest Updates