వీడియోలపై వివాదం : అమెరికా YouTube హెడ్ క్వార్టర్స్ లో కాల్పులు

ytయూట్యూబ్‌ ప్రధాన కార్యాలయంపై  ఓ మహిళ కాల్పులు జరిపింది. కాల్పుల ఘటనతో ఆఫీసులోని ఉద్యోగులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రాణభయంతో ఉద్యోగులు పరుగులు తీశారు. అమెరికాలోని కాలిఫోర్నియాలోని శాన్ బ్రూన్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయోత్పాతాన్ని నింపింది.

మంగళవారం(ఏప్రిల్3) మధ్యాహ్నా సమయంలో అమెరికాలోని కాలిఫోర్నియోలోని శాన్ బ్రూన్ లోని యూ ట్యూబ్ హెడ్ ఆఫీస్ దగ్గర మహిళ ఒక్కసారిగా 10 రౌండ్లు కాల్పులు జరిపింది. దీంతో మొదట భూ ప్రకంపనలు వచ్చాయని ఆఫీస్ ఉద్యోగులు భావించారు. అయితే మహిళ వరుస కాల్పులు జరపడంతో  ఆఫీసులోని ఉద్యోగులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల జరుపుతున్న సమయంలో ఆమె తనను తాను కాల్చుకొని చనిపోయింది. ఘటనాస్ధలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్ధితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.

ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ స్పందించారు. బాధితులకు సంఘీభావం తెలిపారు. సకాలంలో స్పందించిన లా అండ్‌ ఎన్‌పోర్స్‌మెంట్‌ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. మరోవైపు ఈ ఘటనపై గుగూల్‌ CEO సుందర్‌ పిచాయ్‌ విచారం వ్యక్తం చేశారు. మాటలకు అందని విషాదమని, ఈ విషాదాన్ని వర్ణించడానికి మాటలు రావడం లేదని పిచాయ్ ట్వీట్ చేశారు. ఈ కష్ట సమయంలో మా ఉద్యోగులు, యూట్యూబ్‌ కమ్యూనిటీకి అండగా ఉండేందుకు నేను, సుసాన్‌ వొజ్సిస్కి (యూట్యూబ్‌ CEO) ప్రయత్నిస్తున్నాం. వెంటనే స్పందించిన పోలీసులకు, మాకు అండగా సందేశాలు పంపిన వారికి కృతజ్ఞతలు అని పిచాయ్‌ తన ట్వీట్ లో తెలిపాడు.

ఈ కాల్పుల ఘటనపై  మైక్రోసాఫ్ట్‌ CEO సత్య నాదెళ్ల, యాపిల్‌ CEO టిమ్‌ కుక్‌, ట్విట్టర్‌ CEO జాక్‌ డోర్సె తదితరులు గూగుల్‌, యూట్యూబ్‌ ఉద్యోగులకు అండగా ట్వీట్‌ చేశారు. ఈ కష్ట సమయంలో తాము వారికి అండగా ఉన్నామని, వారు త్వరగా ఈ షాక్‌ నుంచి కోలుకోవాలని ట్వీట్ చేశారు.

Posted in Uncategorized

Latest Updates