వీడియో లింక్ తో కేసుల విచారణ.. దేశంలోనే వరంగల్ లో తొలిసారి

కోర్టు, పోలీసుల మధ్య సమన్వయం ఉంటేనే కేసులను వేగంగా పరిష్కరించగలమని సుప్రీం కోర్టు న్యాయమూర్తి  మదన్ బి లోకూర్ చెప్పారు. పోలీస్‌ స్టేషన్లను న్యాయవ్యవస్థతో అనుసంధానం చేస్తూ కొత్తగా రూపొందించిన ‘ఇంటర్‌ఆపరబుల్‌ క్రిమినల్‌ జస్టిస్‌ (ICJS) ను ఆయన అన్‌లైన్‌ లో శనివారం డిసెంబర్ 14న ప్రారంభించారు.

ఇప్పుడు అందుబాటులో వున్న టెక్నాలజీని ఉపయోగించుకుని కోర్టు, పోలీస్‌ విభాగాల అనుసంధానం చేయడం ద్వారా వేగంగా కోర్టు కేసులను పరిష్కరించగలం అన్నారు మదన్ బి లోకూర్. అందుకే.. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఇంటర్‌ ఆపరేబుల్‌ క్రిమినల్‌ జస్టిస్‌ సిస్టం ను రూపొందించామన్నారు. ఈ ఐ.సి.జె.ఎస్‌. టెక్నాలజీతో… పోలీస్‌ స్టేషన్లలో నమోదైన కేసులను క్షణాల్లోనే స్థానిక కోర్టుకు అనుసంధానం చేయొచ్చని.. కేసులకు సంబంధించిన చార్జీషీట్లను  వీడియో కాన్ఫరెన్స్ తో కోర్టుకు అందజేసేందుకు వీలుంటుందని చెప్పారు.

ICJS తో పోలీస్‌ స్టేషన్‌ లో నమోదైన ఎఫ్‌.ఐ.ఆర్‌, సి.సి. నంబర్లు, వారెంట్లు, సమన్లను కూడా కోర్టు ద్వారా పోలీస్‌ సిబ్బంది పొందొచ్చు. కోర్టు, పోలీసులను మధ్య  టైమ్ సేఫ్ అవుతుంది. పోలీస్ సిబ్బంది వినియోగం అవసరం తగ్గుతుంది. అందుకే దేశమంతటా ఈ వ్యవస్థను అందుబాటులోకి తేవాలనుకుంటోంది సుప్రీంకోర్టు. పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా దేశంలోనే తొలి పోలీస్‌ స్టేషన్‌గా.. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్ పరిధిలోని సుబేదారి పోలీస్‌ స్టేషన్‌ ను ఎంపిక చేశారు.

వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ వి.రవీందర్‌ తొలిసారిగా సుబేదారి పోలీస్‌ స్టేషన్‌ లో చివరగా నమోదైన కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సుప్రీంకోర్ట్‌  న్యాయమూర్తికి వీడియో కాన్ఫరెన్స్ లో వివరించారు. ఐ.సి.జె.ఎస్‌ పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసురావడంలో కృషి చేసిన వారందరికి, ప్రత్యేకంగావరంగల్‌ పోలీసులకు సుప్రీంన్యాయమూర్తి అభినందించారు. కేసులకు సంబంధించి సరైన సమయానికి పత్రాలను అందజేయకపోవడం… సాక్షులు కోర్టుకు హాజరుకాకపోవడం వల్లే కోర్టుల్లో చాలా ఏళ్లుగా ఎన్నో కేసులు పెండింగ్‌ లో వున్నాయన్నారు. వీటినంటిని ఐ.సి.జే.ఎస్‌ విధానంతో అధిగమించొచ్చని లోకుర్ తెలియజేశారు. వీడియో సమావేశంలో రాష్ట్ర డీజీపీ యం.మహేందర్‌ రెడ్డి, వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ వి.రవీందర్‌, సుబేదారి ఇన్స్‌స్పెక్టర్‌ సదయ్య పాల్గొన్నారు. పైలెట్‌ ప్రాజేక్ట్‌గా సుబేదారి పోలీస్‌ స్టేషన్‌ ఎంపిక కావడం తెలంగాణ పోలీసులు గర్వించాల్సిన విషయమన్నారు.

 

Posted in Uncategorized

Latest Updates