వీడు దేశముదురు : రైతుల పేరుతో వేల కోట్లు బ్యాంక్ లోన్

మహారాష్ట్రలోని ఓ బిజినెస్ మ్యాన్ రైతుల పేరుతో 5 వేల 400 కోట్లు బ్యాంకులో లోన్ తీసుకొన్నాడు. ఆ డబ్బులను షెల్ కంపెనీలలో ఇన్వెస్ట్ చేశాడు. రైతుల పేరుతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి వేల కోట్లు లోన్ తీసుకొన్న వ్యవహారం ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్ అయింది.
మహారాష్ట్రలోని పర్భాని జిల్లాలోని ఘన్ కేడ్ ఘుగర్ అండ్ ఎనర్జీ లిమిటెడ్ ప్రమోటర్ రత్నాకర్ గుట్టే.. 2015 లో 600 మంది రైతుల పేరుతో ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి బ్యాంకుల్లో 5 వేల 400 కోట్లు అప్పు తీసుకున్నాడని ప్రతిపక్ష ఎన్సీపీ నేత ధనుంజయ్ ముండే తెలిపారు. తీసుకున్న లోన్ ను రత్నాకర్…. వివిధ అకౌంట్ల ద్వారా వివిధ కంపెనీలకు మళ్లించాడని తెలిపారు. లోన్ డబ్బులను దారి మళ్లించడం కోసం రత్నాకర్ గుట్టే 22 షెల్ కంపెనీలను ప్రారంభించాడని తెలిపారు.

ఇప్పుడు రైతులకు తీసుకున్న లోన్లు కట్టాలంటూ బ్యాంకులు నోటీసులు జారీ చేస్తున్నాయని, కొంతమంది రైతులపై 25 లక్షల వరకూ లోన్ ఉందని ధనుంజయ్ ముండే తెలిపారు. అసలు ఏం జరుగుతోందో తెలియక రైతులు ఏడుస్తున్నారని తెలిపారు. తీసుకోని అప్పులు కట్టాలంటూ బ్యాంకులు వేధిస్తున్నాయని రైతులు వాపోతున్నారన్నారు. రత్నాకర్ పై జులై-5న వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటికీ రత్నాకర్ ను అరెస్ట్ చేయలేదు. ఇది చాలా సీరియస్ ఇష్యూ అని, అతడ్ని అరెస్ట్ చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. అతడు కూడా నీరవ్ మోడీ లాగా విదేశాలకు పారిపోతాడని ముండే మహారాష్ట్ర కౌన్సిల్ లో తెలిపారు. ఈ విషయంపై ప్రభుత్వ వివరణ కోరారు కౌన్సిల్ చైర్మన్.

Posted in Uncategorized

Latest Updates