వీడు ప్రపంచ ముదురు : నకిలీ వేలిముద్రలనే తయారు చేశాడు

KYC FINGER PRINTతన టార్గెట్ ను రీచ్ అయ్యేందుకు ఓ టెలికం సంస్థ డిస్ట్రిబ్యూటర్ ఫేక్ వేలి ముద్రలనే సృష్టించాడు. మనిషి గుర్తింపు కోసం హై టెక్నాలజీతో ఆధార్ కు ఫింగర్ ఫ్రింట్ లింక్స్ తో సిమ్ కార్డులు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అతడు అనుకున్న టార్గెట్ కు సరిపడా కస్టమర్లు సిమ్ కార్డులు కొనుగోలు చేయకపోవడంతో ప్రపంచంలోనే ఎవరూ ఊహించని పని చేశాడు. ఫేక్ ఫింగర్ ప్రింట్స్ సృష్టించాడు. చివరకు జైల్లో చిప్పకూడు తింటున్నాడు.

వివరాల్లోకెళితే..పెద్దపల్లి జిల్లా ధర్మారం గ్రామానికి చెందిన పాత సంతోష్‌ కుమార్‌ BSC చదువు మధ్యలోనే మానేశాడు. ధర్మారం బస్టాండ్‌ సమీపంలో ధనలక్ష్మి కమ్యూనికేషన్స్‌ పేరుతో దుకాణం ఏర్పాటు చేసి, వొడాఫోన్‌ ప్రీ–పెయిడ్‌ కనెక్షన్స్‌ డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేస్తున్నాడు. రూ.51 టాక్‌టైమ్‌తో ఉచితంగా ఇచ్చే ఈ సిమ్‌కార్డులను నెలకు కనీసం 600 విక్రయిస్తే.. ఒక్కో కనెక్షన్‌కు రూ.15 చొప్పున కమీషన్‌ ఇస్తామన్నది కంపెనీ పెట్టిన టార్గెట్‌. అయితే ఒక్కొక్కరి పేరిట గరిష్టంగా తొమ్మిది సిమ్‌ కార్డులు మాత్రమే తీసుకునేలా.. కచ్చితంగా ఆధార్, ఈ–కేవైసీ యంత్రంలో వేలిముద్ర ఎంట్రీ తర్వాతే సిమ్‌ యాక్టివేషన్‌ జరిగేలా కొంతకాలం కింద నిబంధనలు అమల్లోకి వచ్చాయి. దీనివల్ల సిమ్‌ విక్రయాల టార్గెట్‌ పూర్తిగాక కమీషన్‌ రావడం ఆగిపోయింది. దీంతో సంతోష్‌ ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాడు.

ఎవరో ఒకరి పేరు మీద సిమ్‌ కార్డులు యాక్టివేట్‌ చేయడం ద్వారా టార్గెట్‌ పూర్తి చేసుకోవాలని భావించాడు. ఇందుకోసం స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ల సమయంలో వేలిముద్రల వివరాలను డాక్యుమెంట్‌ లో పొందుపరుస్తారని గుర్తించాడు. సబ్‌–రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో కేటాయించే డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌ నంబర్ల సిరీస్‌ ను పరిశీలించాడు. దీంతో రిజిస్ట్రేషన్ వెబ్ సైట్ లో ఆ సిరీస్‌ లో తర్వాతి నంబర్లను నమోదు చేస్తూ.. వరుసగా డాక్యుమెంట్లను డౌన్‌ లోడ్‌ చేశాడు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది స్థిరాస్తుల యజమానుల ఆధార్, పేరు, చిరునామా, వేలిముద్రలు వంటి పూర్తి వివరాలను సమకూర్చుకున్నాడు.

యూట్యూబ్‌ లో వీడియోలు చూసి.. రబ్బర్‌ స్టాంపుల తయారీ యంత్రాన్ని వినియోగించి వేలిముద్రలు తయారు చేసే విధానం నేర్చుకున్నాడు.  అలాంటి ఓ యంత్రాన్ని కొనుక్కొచ్చి తన ధనలక్ష్మి కమ్యూనికేషన్స్‌ దుకాణంలో ఏర్పాటు చేసుకున్నాడు. ఇలా రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్ల సహాయంతో పెద్ద సంఖ్యలో నకిలీ వేలిముద్రలను తయారు చేసిన సంతోష్‌.. ఈ–కేవైసీ యంత్రంలో సదరు ఆధార్‌ వివరాలు, ఇతర వివరాలు నమోదు చేసి, వేలిముద్రను పెట్టి.. సిమ్‌కార్డులను యాక్టివేషన్‌ చేశాడు. తర్వాత ఆ సిమ్‌కార్డులను ధ్వంసం చేసేసినా.. కొత్త కనెక్షన్ల టార్గెట్‌ మాత్రం పూర్తయి, సిమ్‌ విక్రయాల కమీషన్‌ అందింది. అయితే నెల రోజుల్లోనే ఆరు వేల సిమ్‌కార్డులు యాక్టివేట్‌ చేశాడు.

అయితే ఒకే ఈ–కేవైసీ యంత్రం నుంచి భారీగా సిమ్‌కార్డుల కోసం ఆధార్‌ అప్రూవల్స్‌ పొందిన విషయాన్ని గుర్తించిన UIDAI  విజిలెన్స్‌ విభాగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఉగ్రవాదులు, మావోయిస్టులతోపాటు అసాంఘిక శక్తులకు అక్కడి నుంచి సిమ్‌ కార్డులు చేరుతున్నాయని గుర్తించి.. కేంద్ర నిఘా వర్గాల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో రంగంలోకి దిగిన నిఘా అధికారులు, 18 ప్రభుత్వ విభాగాల అధికారులు.. సంతోష్‌కుమార్‌ ను విచారించారు. సిమ్‌ కార్డుల యాక్టివేషన్‌ టార్గెట్‌ పూర్తి చేసుకోవడం కోసం సంతోష్‌ చేసిన పని.. రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్ల నుంచి వేలిముద్రల సేకరణ, రబ్బరు స్టాంపుల యంత్రంతో నకిలీ వేలిముద్రల తయారీ, ఇందుకోసం ఇంటర్నెట్‌ను వినియోగించుకున్న తీరు వంటివి తెలుసుకుని అవాక్కయిన అధికారులు..  సంతోష్ ని పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates