వీడు మాములోడు కాదు : ఉత్తుత్తి బ్యాంక్ పెట్టి.. బురిడీ కొట్టించాడు

bank22ఇప్పటి వరకూ మనం నకిలీ నోట్లనో, నకిలీ వస్తువులనో మాత్రమే చూసుంటాం. అయితే ఇప్పుడు మనం నకిలీ బ్యాంక్ ను కూడా చూడవచ్చు. నకిలీ బ్యాంక్ ఏంటబ్బా.. అది ఎలా ఉంటుందని తెలుసుకోవాలనుకుంటున్నారా? అసలు ఆ బ్యాంక్ లో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారో తెలిస్తే ఆశ్యర్యపోక తప్పదు మరి.

ఉత్తరప్రదేశ్ కు చెందిన వినోద్ కాంబ్లీ అనే వ్యక్తి బలియాలోని ములాయంనగర్ లో కర్ణాటక బ్యాంక్ నకిలీ శాఖను ప్రారంభించాడు. తప్పుడు పత్రాలు, కర్ణాటక బ్యాంక్ పేరుతో స్టాంపులు, అకౌంట్ పాస్ బుక్ లు ప్రింట్ చేసి ఒరిజనల్ బ్రాంచ్గా అందరినీ నమ్మించాడు. ఇందులో 15 మందికి అకౌంట్లు ఇచ్చాడు. వారి దగ్గర నుంచి ఒక లక్షా 37 వేలు కూడా వసూలు చేశాడు. కొత్తగా పెట్టిన ఉత్తుత్తి బ్యాంక్ ను మరింత విస్తరించటంలో భాగంగా ప్రచారం మొదలుపెట్టాడు. విషయం తెలుసుకున్న మిగతా బ్యాంకులు.. ఆరా తీశాయి. అసలు కొత్త బ్యాంక్ బ్రాంచ్ ఇక్కడి ఎలా వచ్చిందో తెలుసుకోవటం కోసం పోలీసులకు కంప్లయింట్ చేశారు. ఖాకీల ఎంట్రీతో విషయం బట్టబయలు అయ్యింది.

వారణాసి కర్ణాటక బ్యాంక్ బ్రాంచ్ అధికారులు ఈ బ్యాంక్ కు వచ్చి సోదాలు చేశారు. అది నకిలీ బ్యాంక్ అని తేల్చేశారు. దీంతో వారిని పోలీసులకు అప్పగించారు. ఐపీసీ సెక్షన్ 419, 420, 467, 468, 471 కింద వీరిపై కేసు నమోదు చేశారు. వారి దగ్గర ఉన్న కంప్యూటర్లు, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఉత్తుత్తి బ్యాంక్ ను ముందుగానే గుర్తించటంతో సరిపోయిందని.. లేకపోతే ఎంతో మంది మోసపోయేవారని చెబుతున్నారు పోలీసులు. ఏకంగా నకిలీ బ్యాంక్ బ్రాంచ్ ఓపెన్ చేయటం దేశంలో ఇదే ఫస్ట్ అంటున్నారు.

Posted in Uncategorized

Latest Updates