వీధులు కాదు నదులు : వరదల్లో ఈశాన్య రాష్ట్రాలు

FLOOD

ఈశాన్య రాష్ట్రాలను వరదలు ఆగమాగం చేస్తున్నాయి. అస్సోం, మిజోరాం,  త్రిపుర, మణిపూర్ రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. మరోపక్క దక్షిణాది రాష్ట్రాలైన  కేరళ, కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. యూపీ, ఢిల్లీని దుమ్ముతుపాన్ కమ్మేసింది. ఈశాన్య రాష్ట్రం అయిన అసోంలో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. వరదల కారణంగా రైళ్లు రద్దయ్యాయి. దిఫోలు నది ప్రమాద స్థాయిలో ప్రవహిస్తుండటంతో 37జాతీయ ప్రధాన రహదారి మునిగిపోయింది. కజిరంగ నేషనల్  పార్క్ లోకి నీళ్లు చేరాయి. గోల్ ఘాట్ , కబ్రి అంగ్ లాంగ్  ఈస్ట్, కబ్రి అంగ్ లాంగ్  వెస్ట్ , బిస్వనాత్ , కరీంగంజ్, హైలకండి ప్రాంతాల్లో వరదల ప్రభావం ఎక్కువగా ఉంది. బాధితుల కోసం 71 సహాయక శిబిరాలు ఏర్పాటు చేశారు. 131 బెటాలియన్ల బీఎస్ఎఫ్ బలగాలతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బోట్ల సాయంతో నీళ్లల్లో చిక్కుకున్నవారిని కాపాడుతున్నాయి ఎన్డీఆర్ఎఫ్ బలగాలు.

ఇక మణిపూర్ నూ వర్షాలు ముంచెత్తాయి. 40 నియోజకవర్గాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. ఇంఫాల్, కొండ ప్రాంతాల్లో వరద తీవ్రత ఎక్కువగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. అసోం – మణిపూర్ కలిపే ప్రధాన జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో రాకపోకలు నిలిచిపోయాయి.

ఇక మిజోరాం రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐజ్వాల్ తో పాటు నాలుగు జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలు చోటుచేసుకున్నాయి. వరదల కారణంగా త్రిపురలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలను సహాయక శిబిరాలకు తరలించారు. వరద బాధితుల కోసం 76 సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు. కైలషాహర్, ఇంద్రానగర్, ఫాటిక్రోయ్, శాంటైల్, కుమార్ ఘాట్ ప్రాంతాల్లో వేలాది ఇళ్లు నీటమునిగాయి. 950 మందిని ఆర్మీ సిబ్బంది కాపాడగా.. 15 వేల మందిని పునరావస కేంద్రాలకు తరలించారు.

దక్షిణాదిన కేరళ రాష్ట్రం కోజికోడ్ లో భారీ వర్షాలు, వరదల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో ముగ్గురు మృతి చెందారు. తొమ్మిది మంది గల్లంతయ్యారు. అలప్పుజ, మలప్పురం, వేయాండ్, కొట్టాయంతో పాటు కూతపతీ ప్రాంతాలు నీటమునిగాయి. దీంతో వేల ఎకరాల పంట నీటమునిగింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పలు విద్యా సంస్థలను మూసివేశారు. ఇడుక్కి, వేయాండ్ , కోజికోడ్  జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగి పడటంతో రోడ్లు ధ్వంసమయ్యాయి.

Posted in Uncategorized

Latest Updates