వృద్ధురాలిని చావకొట్టింది :ఆస్తి కోసం చిత్ర హింసలు

OLDAGEవృద్ధులపై వివక్ష తగదని చట్టాలు చెబుతున్నప్పటికీ వృద్ధుల కష్టాలు మాత్రం తీరడం లేదు. కనిపెంచిన తల్లిదండ్రులు పిల్లలకు భారం అవుతున్నారు. పిల్లలే కాదు తోబుట్టువులు అలాగే చూస్తున్నారు. అవసరాలకు పని చేయించుకుని తర్వాత వృద్ధులయ్యాక నానా కష్టాలు పెడుతున్నారు. ఇప్పుడు ఓ వృద్ధిరాలిపై జరిగిన చిత్రహింసలు అందరినీ కదిలిస్తుంది.

అసలే వృద్ధురాలు.. ఆపై పక్షవాతం వచ్చి మంచం పట్టింది. ఒంట్లో శక్తి ఉన్నంతవరకు కష్టపడి సంపాదించినదంతా చెల్లెలు వరసైన మరో మహిళకు అప్పగించింది. అయినా కనీస కనికరంలేకుండా వృద్ధురాలిని ఆమె చెల్లెలు చిత్రహింసలు పెడుతోంది. కాలుతో తన్నుతూ, చెప్పులతో కొడుతూ నరకం చూపింది. ఈ దృశ్యాన్ని చూసిన స్థానిక యువకుడు సెల్‌ ఫోన్‌ లో వీడియో తీసి, సోషల్ మీడియాలో  పెట్టడంతో వృద్ధురాలిపై జరుగుతున్న దారుణం వెలుగులోకి వచ్చింది. చావుబతుకుల మధ్యనున్న ఆమె ప్రస్తుతం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోంది.

తూర్పుగోదావరి జిల్లా పెనికేరు గ్రామానికి చెందిన పంతం పుష్పవతి భర్త చనిపోవడంతో రాజానగరం పరిధి నరేంద్రపురంలో తన చెల్లెలు వరసైన ప్రగడ మంగాదేవి ఇంట్లో ఉంటోంది. ఆమెకూ భర్త లేడు. తన కుమారుడితో కలిసి ఉంటోంది. పుష్పవతికి పెనికేరులో కొంత ఇంటి స్థలం ఉంది. అది తన పేరున రాస్తుందన్న ఆశతో ఆమె బాగోగులను మంగాదేవి చూసేది. ఒంట్లో ఓపిక ఉన్నంతకాలం పుష్పవతి కూలిపనులకు వెళ్లి డబ్బులు తెచ్చి మంగాదేవికి ఇచ్చేది. ఏడాది కిందట పక్షవాతం రావడంతో మంచానికే పరిమితమైంది. స్వగ్రామంలో ఉన్న స్థలాన్ని తనకు రాసివ్వమని మంగాదేవి తరచూ పుష్పవతిని ఒత్తిడి చేసేది.

తన సోదరులకు ఇచ్చే ఉద్దేశంతో ఉన్న పుష్పవతి నిరాకరించింది. మంగాదేవి మంచంపై ఉన్న పుష్పవతిని చిత్రహింసలకు గురిచేయడం మొదలుపెట్టింది. స్థానికులు ప్రశ్నించడంతో మూడు నెలల కిందట అక్కడి నుంచి ఇల్లు ఖాళీచేసి నగరంలోని లాలాచెరువు హౌసింగ్‌బోర్డు కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుంది. అక్కడ పుష్పవతిని కొడుతుండడాన్ని గమనించిన స్థానిక యువకుడు వీడియోతీసి బయటపెట్టాడు. దాంతో ఆదివారం(ఏప్రిల్-15) స్థానికులంతా మంగాదేవిని నిలదీశారు. పుష్పవతిని ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. మంగాదేవిని బొమ్మూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

 

Posted in Uncategorized

Latest Updates