వెయిటర్ తో గొడవ : రెస్టారెంట్ ఓనర్ పై కాల్పులు

రెస్టారెంట్ ఓనర్ పై ఓ వ్యక్తి కాల్పులు జరిపిన ఘటన సోమవారం (జూలై-30) యూపీలో జరిగింది. ఓ వ్యక్తి రెస్టారెంట్‌ లోకి వచ్చాడు. వెంట తెచ్చుకున్న గన్ తీశాడు.. కౌంటర్‌ పై ఉన్న ఓనర్‌ ను కాల్చాడు. అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఓనర్‌ పై మూడు రౌండ్ల కాల్పులు జరిగినా.. అతను ప్రాణాలతో బయటపడటం విశేషం. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

యూపీలోని సుల్తాన్‌ పూర్‌ లో ఉన్న అవంతిక రెస్టారెంట్‌ లో ఈ ఘటన జరిగింది. అక్కడే ఉన్న CCTV కెమెరాలో ఇదంతా రికార్డయింది. ఆ రెస్ట్‌ రెంట్ ఓనర్ అలోక్ ఆర్యా కౌంటర్ దగ్గర కూర్చున్నాడు. పక్కనే ఉన్న వ్యక్తితో మాట్లాడుతున్న సమయంలో ఓ వ్యక్తి వచ్చి కాల్చి వెళ్లిపోయాడు. అతన్ని ఇద్దరు వ్యక్తులు పట్టుకోవడానికి ప్రయత్నించినా.. అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాల్పులు జరిగిన తర్వాత గాయాల పాలైన అలోక్ అక్కడి నుంచి బయటకు వచ్చి కుప్పకూలిపోయాడు. వెంటనే రెస్టారెంట్ సిబ్బంది అతన్ని ఆసుపత్రికి తరలించారు.

కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అతడు స్థానిక కాంట్రాక్టర్. కాల్పులు జరపడం వెనుక కచ్చితమైన కారణమేంటో మాత్రం తెలియలేదు. అయితే అంతకుముందే రెస్టారెంట్ వెయిటర్‌ తో ఆ వ్యక్తి గొడవపడ్డాడు. ఆ సమయంలో ఓనర్ అలోక్ ఆర్యా జోక్యం చేసుకొని ఆ వ్యక్తిని అక్కడి నుంచి పంపించేశాడు. రెండు గంటల తర్వాత మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి వచ్చి అలోక్‌ పై కాల్పులు జరిపాడు. అలోక్ ఆ ప్రాంతంలో కాస్త పేరున్న వ్యాపారవేత్త కావడంతో పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు.

 

 

Posted in Uncategorized

Latest Updates